భారత సంపన్న మహిళ రోషినీ నాడార్ మల్హోత్రా

న్యూఢిల్లీ: హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. మన దేశంలోని టాప్ 100 మహిళా సంపద సృష్టికర్తలను కోటక్ వెల్త్ మేనేజ్మెంట్, హురున్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించారు. బయోకాన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్-షా, యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్పర్సన్ లీనా గాంధీ తివారీ వరుసగా రెండు, మూడవ స్థానాలను ఆక్రమించారు. నాలుగో స్థానంలో హైదరాబాద్కు చెందిన మహిళ నీలిమా మోటపార్తికి దక్కింది. జోహోకు చెందిన రాధా వెంబు (5 వ స్థానం), అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ (6వ స్థానం), హీరో ఫిన్కార్ప్కు చెందిన రేణు ముంజాల్ (7 వ స్థానం), అలెంబిక్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ మాలికా చిరాయు అమిన్ (8వ స్థానం), థర్మక్స్కు చెందిన అను ఆగా, మెహర్పుదుంజీ (9వ స్థానం), ఫల్గుని నాయర్, కుటుంబం (10 వ స్థానం) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా రూ.54,850 కోట్ల సంపదతో 2020 లో భారతదేశంలో అత్యంత ధనవంతురాలుగా నిలిచారు. కిరణ్ మజుందార్-షా రూ.36,600 కోట్ల నికర విలువతో ఉండగా.. ముంబయికి చెందిన ఫార్మాస్యూటికల్ మేజర్ యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్పర్సన్ లీనా గాంధీ తివారీ సుమారు రూ.21,340 కోట్ల సంపద కలిగి వున్నారు. దివిస్ లాబొరేటరీస్ డైరెక్టర్ (కమర్షియల్) నీలిమా మోటపార్తి ఆస్తి రూ.18,620 కోట్లు, జోహో రాధా వెంబు ఆస్తి రూ .11,590 కోట్లు, అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ .10,220 కోట్ల నికర విలువతో ఉన్నారు.
ఈ జాబితాలో మహిళా సంపద సృష్టికర్తల మొత్తం సంపద రూ.2,72,540 కోట్లు అని నివేదిక తెలిపింది. మొత్తం ఎనిమిది మంది డాలర్ బిలియనీర్లు ఉండగా, జాబితాలో 38 మంది మహిళలు రూ.1,000 కోట్లు, అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో మహిళల సగటు వయస్సు 53 సంవత్సరాలు. 69 మంది సంపద సంరక్షకులు కాగా, 31 మంది స్వయంగా పైకొచ్చిన మహిళలు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.