బుధవారం 21 అక్టోబర్ 2020
Business - Sep 24, 2020 , 19:50:09

భారత్‌ విడిచి వెళ్లిపోతున్న హార్లే డేవిడ్సన్‌

భారత్‌ విడిచి వెళ్లిపోతున్న హార్లే డేవిడ్సన్‌

భారత మార్కెట్లో ఎక్కువ డిమాండ్ లేని కారణంగా అమెరికన్ మోటారుసైకిల్ తయారీదారు హార్లే డేవిడ్సన్‌ ఇక్కడ తమ కార్యకలాపాలను ముగించింది. ఇప్పుడు ఉత్తర అమెరికా, యూరప్ వంటి లాభదాయక మార్కెట్లపై దృష్టి పెట్టనున్నారు. 

హార్లే-డేవిడ్సన్ మోటారు సైకిళ్ల అమ్మకాలు, ఉత్పత్తి కార్యకలాపాలను భారతదేశంలో ముగించాలని హార్లే డేవిడ్సన్‌ కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ దిగ్గజ అమెరికన్ మోటారుసైకిల్ తయారీదారు రివైర్‌ వ్యూహంలో భాగంగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇకపై తాము ఎంచుకున్న మార్కెట్లపై మాత్రమే దృష్టి పెట్టనున్నారు. హార్లే-డేవిడ్సన్ భారతదేశంతో పాటు తక్కువ అమ్మకాలు, లాభాలు లేని మార్కెట్ల నుంచి కార్యకలాపాలను మూసివేస్తున్నది. హార్లే-డేవిడ్సన్ 2009 లో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో విస్తృత శ్రేణి ఉత్పత్తులను కలిగి ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా భారతదేశంలో హెచ్-డీ బైక్‌ల డిమాండ్ క్షీణించింది.

2020 ఏప్రిల్‌ నుంచి జూన్ మధ్య మొదటి త్రైమాసికంలో 96 మిలియన్ డాలర్ల నష్టాన్ని కంపెనీ నివేదించింది. యుఎస్‌తో పాటు పలు మార్కెట్లలో దాదాపుగా కల్ట్-ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, హార్లే-డేవిడ్సన్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీనిని ఎదుర్కోవటానికి సంస్థ కొన్ని నెలల క్రితం 'రివైర్' వ్యూహాన్ని రూపొందించింది. ఇందులో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల వంటి లాభదాయక మార్కెట్లకు కార్యకలాపాలను ఏకీకృతం చేశారు. భారతదేశం వంటి అనేక తక్కువ లాభదాయక మార్కెట్లలో కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హార్లే-డేవిడ్సన్ 2020 జూలైలో భారతదేశంలో 103 యూనిట్ల మోటారు సైకిళ్లను, గత నెలలో దేశంలో 176 యూనిట్లను విక్రయించింది.

అధికారికంగా ప్రకటించిన సంస్థ

భారతదేశంలో తన వ్యాపార నమూనాను మారుస్తున్నామని, ఎంపికలను అంచనా వేస్తున్నామని హార్లే-డేవిడ్సన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. బావాల్‌లో తన ఉత్పాదక సదుపాయాన్ని మూసివేయాలని, గుర్గావ్‌లోని తన అమ్మకపు కార్యాలయ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. డేవిడ్సన్ డీలర్ నెట్‌వర్క్ కాంట్రాక్ట్ టర్మ్ ద్వారా వినియోగదారులకు సేవలను కొనసాగిస్తుంది అని పేర్కొన్నది.


logo