శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 08, 2020 , 11:53:17

పన్నులను సరళీకరిస్తాం

పన్నులను సరళీకరిస్తాం

న్యూఢిల్లీ, జనవరి 7: పన్నుల వ్యవస్థను సరళతరం చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలను తీసుకుంటున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. నిజాయితీగా పన్నులు చెల్లించేవారిపై వేధింపులకు తావులేకుండా చూస్తున్నామని తెలిపారు. మంగళవారం ఇక్కడ అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దాఖలు వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలను తీసుకుంటున్నామని చెప్పారు. వీటి ఆధారంగా పన్నుల వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు. ఇప్పటికే గతేడాది అక్టోబర్‌లో ముఖరహిత ఎలక్ట్రానిక్‌ మదింపు పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేసిన నిర్మల.. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులకు, మదింపు అధికారులకు మధ్య ఎలాంటి జోక్యాలు లేకుండా అరికట్టామని, పారదర్శకంగా పన్నుల మదింపు జరిగేలా చేశామని వివరించారు. జవాబుదారీతనం కోసం కంప్యూటర్‌ ఆధారిత డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ (డీఐఎన్‌)ను అమలుపరుస్తున్నామని తెలిపారు. నిరుడు అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన డీఐఎన్‌ వ్యవస్థను అన్ని రకాల ఐటీ శాఖ సమాచారాలకు వర్తింపజేస్తామన్నారు. మదింపు, దర్యాప్తు, విజ్ఞప్తులు, జరిమానా, దిద్దుబాటు తదితర అవసరాల కోసం ఈ డీఐఎన్‌ను వినియోగిస్తామని చెప్పారు. దీనివల్ల నకిలీ నోటీసులు, లేఖలను గుర్తించే వీలుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేగాక ఈ తరహా మోసాల కేసులను 30 రోజుల్లోపు పరిష్కరిస్తామన్నారు.


షాపింగ్‌ ఫెస్టివల్స్‌..

ఇదిలావుంటే త్వరలో దేశవ్యాప్తంగా షాపింగ్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తామని, వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఇది దోహదపడుతుందని నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్‌ తరహా మెగా షాపింగ్‌ ఫెస్టివల్స్‌ను భారత్‌లోనూ నిర్వహిస్తామని గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నుంచి ఇవి మొదలు కానున్నాయి. ఇందుకు సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తుందని, తద్వారా తమ వస్తూత్పత్తులను వర్తకులు అమ్ముకునేందుకు ఓ పెద్ద వేదికను కల్పిస్తుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఫెస్టివల్స్‌ను దేశంలోని నాలుగు నగరాల్లో నిర్వహించనున్నారు.


logo