గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 22, 2021 , 00:14:30

రాష్ట్రాల‌కు జీఎస్టీ కేటాయింపుల్లో కోత‌కు చెక్‌?!

రాష్ట్రాల‌కు జీఎస్టీ కేటాయింపుల్లో కోత‌కు చెక్‌?!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారితో రెవెన్యూ వ‌సూళ్లు ప‌డిపోవ‌డంతో కొంత కాలంగా రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయిస్తున్న జీఎస్టీ వాటాల్లో కోత‌కు ఇక తెర ప‌డ‌నున్న‌ది. నాలుగు నెలలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు క్రమంగా పుంజుకున్నాయి. ఈ  నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న జీఎస్టీ ఆదాయ కొరత రూ.40 వేల కోట్ల మేర తగ్గే అవకాశం ఉన్న‌దని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు భారీగా తగ్గనుందని ఆ వ‌ర్గాల క‌థ‌నం. అయితే, 14 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం కష్టమేనని అభిప్రాయపడ్డాయి. 

ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రాల జీఎస్టీ ఆదాయంలో రూ.1.80 లక్షల కోట్లు కొరత ఏర్పడే అవకాశం ఉందని తొలుత కేంద్ర ప్ర‌భుత్వం అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంట్లో రూ.1.10 లక్షల కోట్లు జీఎస్టీ అమలు కారణంగా, మిగిలిన రూ.70వేల కోట్లు కరోనా సంక్షోభం వల్ల తలెత్తనుందని లెక్కగట్టింది.  గత నాలుగు నెలల్లో వసూళ్లు పుంజుకున్న నేపథ్యంలో ఆదాయ కొరత అంచనాలు రూ.1.40 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇక రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ‘ప్రత్యేక బారోయింగ్‌ విండో’ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా రూ.1.10 లక్షల కోట్లు అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విడతల వారీగా రూ.లక్ష కోట్ల పరిహారాన్ని అందిస్తామ‌ని కేంద్రం తెలిపింది. మొత్తం బకాయిల్లో 91% చెల్లించామని వెల్లడించింది.

చట్టం ప్రకారం.. జీఎస్టీ అమలు చేయ‌డం వల్ల రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయ లోటును కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2015-16 ఆర్థిక సంవత్సరం ఆధారంగా చేసుకొని రాష్ట్రాల ఆదాయాల్ని 14 శాతం వృద్ధి రేటుతో లెక్కిస్తారు. ఏమైనా కొరత ఏర్పడితే దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo