గురువారం 28 మే 2020
Business - May 16, 2020 , 23:47:47

ప్రైవేటుకూ బొగ్గు

ప్రైవేటుకూ బొగ్గు

 • కమర్షియల్‌ మైనింగ్‌కు కేంద్రం అవకాశం
 • మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్లు
 • మరో ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ
 • కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మే 16: బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి తెరదించి కమర్షియల్‌ మైనింగ్‌లో ప్రైవేట్‌ సంస్థలకు వీలుకల్పిస్తున్నట్టు కేంద ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బొగ్గుకు స్థిరమైన ధరను నిర్ణయించే విధానానికి బదులుగా ఆదాయాన్ని పంచుకొనే విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. మరోవైపు దేశంలో మరో ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నడిపేందుకు త్వరలో వాటిని వేలం వేయనున్నట్టు తెలిపారు. భారత్‌ అభియాన్‌లో భాగంగా శనివారం ఆమె నాలుగో విడుత ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించారు. 

ఇంతకుముందు సొంత అవసరాలు కలిగిన వినియోగదారుల (క్యాపిటివ్‌ మైనింగ్‌)కు మాత్రమే బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఉండేదని, ఇప్పుడు ఆ నిబంధనలను తొలగిస్తున్నామని చెప్పారు. దీంతో ఇకపై ఎవరైనా వేలంలో పాల్గొనేందుకు వీలుంటుందన్నారు. ఉత్పత్తిలో స్వావలంబనను పెంపొందించడంతోపాటు, దిగుమతులను తగ్గించేందుకు త్వరలో దాదాపు 50 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నట్టు తెలిపారు. బొగ్గు రంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.50 వేల కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు. బొగ్గు తవ్వకాల లక్ష్యాలను గడువు కంటే ముందే అధిగమించినవారికి ఆదాయ పంపకంలో రిబేట్‌ ఇస్తామన్నారు. కోల్‌ బెడ్‌ మీథేన్‌ (సీఎంబీ) ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి రూ.2300 కోట్లు

దేశంలో మూడో విడుతగా మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పీపీపీ పద్ధతిలో నడిపేందుకు త్వరలో అమృత్‌సర్‌, వారణాసి, భువనేశ్వర్‌, ఇండోర్‌, రాయ్‌పూర్‌, తిరుచ్చి విమానాశ్రయాలను వేలం వేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆరు విమానాశ్రయాల వార్షిక ఆదా యం దాదాపు రూ.1000 కోట్లుగా, లాభం సుమారు రూ.540 కోట్లుగా ఉన్నదన్నారు. ఇప్పటివరకు రెండు విడుతల్లో వేలం వేసిన 12 విమానాశ్రయాల్లో ప్రైవేట్‌ సంస్థలు అదనంగా మరో రూ.13 వేల కోట్ల పెట్టుబడులు పెడతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

ప్రస్తుతమున్న విమానాశ్రయాల అభివృద్ధి నిమిత్తం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి రూ.2,300 కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. దేశీయ గగనతలాన్ని మరిం త విస్తృతంగా వినియోగించుకొనేందుకు ఆంక్షలను సడలిస్తున్నామన్నారు. దీనివల్ల పౌర విమానయాన రంగానికి ఏటా దాదాపు వెయ్యి కోట్ల మేరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రస్తుతం భారత గగనతలంలో 60% మాత్రమే విమానయానానికి అందుబాటులో ఉన్నదన్నారు. మరింత గగనతలాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విమాన ప్రయాణాల సమయం తగ్గడంతోపాటు ఎంతో ఇంధనం ఆదా అవుతుందని చెప్పారు.

ఎంఆర్‌వో హబ్‌గా భారత్‌

ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌వో) హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దేందుకు పన్నులను హేతుబద్ధీకరించడం సహా అనేక చర్యలు చేపట్టనున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనివల్ల విమానాల నిర్వహణ ఖర్చులు తగ్గి సివిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకే కాకుండా రక్షణ రంగ విమానాలకూ లబ్ధిచేకూరుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో విమాన విడిభాగాల మరమ్మతు, ఎయిర్‌ఫ్రేమ్‌ మెయింటెనెన్స్‌ విభాగ మార్కెట్‌ పరిమాణం రూ.800 కోట్లుగా ఉన్నదని, రానున్న మూడేండ్లలో ఇది రూ.2000 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నామని ఆమె తెలిపారు.

 • పీపీపీ పద్ధతిలో నడిపేందుకు త్వరలో అమృత్‌సర్‌, వారణాసి, భువనేశ్వర్‌, ఇండోర్‌, రాయ్‌పూర్‌, తిరుచ్చి విమానాశ్రయాల వేలం
 • ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రూ.2,300 కోట్లు
 • దేశీయ గగనతలాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకొనేందుకు ఆంక్షల సడలింపు
 • తద్వారా పౌర విమానయాన రంగానికి ఏటా దాదాపు రూ.1000 కోట్ల మేరకు లబ్ధి
 • త్వరలో 50 బొగ్గు గనులవేలం
 • వేలంలో ఇకపై ఎవరైనా పాల్గొనేందుకు అనుమతి
 • మౌలిక వసతుల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు
 • ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించినవారికి ప్రోత్సాహకాలు


logo