బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Jan 12, 2020 , 01:36:09

పైసల్లేక పరేషాన్‌!

పైసల్లేక పరేషాన్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కేంద్రానికి రూ.1.48 లక్షల కోట్లు సహా మొత్తం రూ. 1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించేందుకు రిజర్వు బ్యాంకు బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయినప్పటికీ ఈ ఏడాదిని ‘అసాధారణ సంవత్సరం’గా పరిగణించి రూ.45,000 మేరకు అదనపు డివిడెండ్‌ను చెల్లించాల్సిందిగా ఆర్బీఐపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నది.

  • మోదీ సర్కార్‌ ఆశలన్నీ రిజర్వు బ్యాంకుపైనే
  • తాత్కాలిక డివిడెండ్‌ కోసం ఒత్తిడి తేవాలని యోచన
  • అసాధారణ సంవత్సరం’గా పరిగణించాలంటున్న కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి 11:ఆదాయం గణనీయంగా పడిపోవడంతో వ్యయహామీలను నెరవేర్చేందుకు అవసరమైనన్ని నిధుల్లేక కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్నది. ఈ నేపథ్యంలో తమకు తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించి ఆదుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)పై ఒత్తిడి తీసుకురావాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నట్టు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధమున్న అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కేంద్రానికి రూ.1.48 లక్షల కోట్లు సహా మొత్తం రూ. 1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించేందుకు రిజర్వు బ్యాంకు బోర్డు కొన్ని నెలల క్రితమే ఆమోదం తెలిపింది. అయితే దీనికి అదనంగా తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించాల్సిందిగా ఆర్బీఐపై ఒత్తిడి తీసుకురావాని కోరాలని కేంద్రం యోచిస్తున్నది. లాభాల్లో అధిక భాగాన్ని ప్రభుత్వ బాండ్లు, కరెన్సీల ట్రేడింగ్‌ ద్వారా ఆర్జిస్తున్న ఆర్బీఐ.. ఈ సంపాదనలో కొంత మొత్తాన్ని తన సంస్థాగత కార్యకలాపాలకు, తాత్కాలిక అవసరాలకు అట్టిపెట్టుకొని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఆర్బీఐ రూ.1.23 లక్షల కోట్ల మిగులు ఆదాయాన్ని ఆర్జించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సంలో వచ్చిన ఆదాయం కంటే చాలా ఎక్కువ.అయితే మార్చి 31వ తేదీతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 5 శాతానికి క్షీణించి 11 ఏండ్ల కనిష్ఠస్థాయికి పతనమవడం ఖాయమని అనేక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు తీవ్ర ఆర్థిక మందగమనం కొనసాగుతుండటం, మరోవైపు గతేడాది కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నిర్దేశించుకొన్న రూ.19.60 కోట్ల లక్షిత రాబడిలో మూడింట ఒక వంతుకుపైగా తగ్గుతుందని మోదీ సర్కారు ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని ‘అసాధారణ సంవత్సరం’గా పరిగణించి తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించాలన్న తమ డిమాండ్‌ను రిజర్వు బ్యాంకు పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం కోరనున్నట్టు ఓ అధికారి తెలిపారు. తాత్కాలిక డివిడెండ్‌ చెల్లింపును నిత్యకృత్యంగా మార్చాలని తాము భావించడంలేదని, కానీ ఈ ఏడాదిని అసాధారణ సంవత్సరంగా పరిగణించి రూ. 35,000 కోట్ల నుంచి రూ.45,000 మేరకు అదనపు డివిడెండ్‌ను చెల్లించాల్సిందిగా ఆర్బీఐపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని ఆ అధికారి చెప్పారు. ఈ ఒత్తిడికి ఆర్బీఐ తలొగ్గితే కేంద్రానికి వరుసగా మూడో ఏడాది తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు అటు కేంద్ర ఆర్థికశాఖ అధికార ప్రతినిధులుగానీ ఇటు ఆర్బీఐ అధికార ప్రతినిధులుగానీ ముందుకు రావడంలేదు.

వ్యతిరేకిస్తున్న ఆర్బీఐ అధికారులు

ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా అనంతరం 2018 చివర్లో ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన శక్తికాంతదాస్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు తమవంతు తోడ్పాటునిచ్చేందుకు రెపోరేటును ఇప్పటివరకు ఐదు విడుతల్లో మొత్తం 135 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతోపాటు ద్రవ్యలభ్యతపై పరిమితులను సరళతరం చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రానికి తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించాలన్న ప్రతిపాదనపై ఆర్బీఐలోని కొంతమంది అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తాహతుకు మించి కేంద్రానికి అదనంగా నిధులు చెల్లిస్తే ఆర్బీఐ తన సంస్థాగత అవసరాలకు జరిపే నిధుల కేటాయింపుపై దుష్ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ తాత్కాలిక డివిడెండ్‌ చెల్లింపునకు రిజర్వు బ్యాంకు బోర్డు ఆమోదముద్ర వేస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉన్నది. ఆర్బీఐ బోర్డులో పలువురు కేంద్ర ప్రభుత్వ నామినీలు ఉండటమే ఈ ధీమాకు కారణం. రిజర్వు బ్యాంకు తన లాభాలను కేంద్రంతో పంచుకొనేందుకు ఓ ఫార్ములాను సిఫారసు చేయాల్సింగా కోరుతూ 2018లో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనలను రిజర్వు బ్యాంకు బోర్డు ఇప్పటికే అంగీకరించి కేంద్రానికి భారీగా డివిడెండ్‌ను చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అయితే ‘అసాధారణమైన ప్రత్యేక పరిస్థితుల్లో’ మాత్రమే కేంద్రానికి తాత్కాలిక డివిడెండ్‌ చెల్లించాలని బిమల్‌ జలాన్‌ కమిటీ స్పష్టం చేసింది.


logo
>>>>>>