గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 27, 2020 , 00:41:06

ఐటీ ఊరట లేనట్లే!

ఐటీ ఊరట లేనట్లే!
  • పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం
  • ఈసారి పన్ను వసూళ్లలో రూ.2.5 లక్షల కోట్లు క్షీణత?
  • నిరాశపరుస్తున్న ఐటీ, కార్పొరేట్‌, జీఎస్టీ రాబడి
  • రాబోయే బడ్జెట్‌లో ఆశించిన కోతలుండకపోవచ్చన్న అంచనాలు

న్యూఢిల్లీ, జనవరి 26: రాబోయే బడ్జెట్‌లో ఆదాయం పన్ను (ఐటీ) కోతలకు అవకాశాలు తక్కువేనని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో పన్ను వసూళ్లు గరిష్ఠంగా రూ.2 లక్షల కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల వరకు తగ్గవచ్చని నిపుణుల అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం.. ఈసారి బడ్జెట్‌లో ఐటీ కోతలపై కేంద్రానికున్న అవకాశాలకు గండి కొట్టిందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ఊరట ఉండకపోవచ్చన్నది నిపుణల మాట. నిజానికి మార్కెట్‌లో చోటుచేసుకున్న స్తబ్ధతను తొలగించడానికి, వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెంచడానికి భారీగా ఐటీ ప్రయోజనాలను ట్యాక్స్‌పేయర్స్‌కు కేంద్రం అందించనుందన్న అంచనాలు విస్తృతంగా ఉన్నాయి. కానీ ఆదాయం పన్ను, కార్పొరేట్‌ పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాకు రూ.1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్లు దూరంగా ఉండవచ్చని, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా రూ.50 వేల కోట్లు పడిపోవచ్చని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఊహించిన స్థాయిలో ఐటీ మినహాయింపులు ఉండకపోవచ్చని అంటున్నాయి. 


ఐటీ శ్లాబుల తగ్గింపు తదితర నిర్ణయాలుండకపోవచ్చని సమాచారం. అయితే దేశ జీడీపీకి ఊతమిచ్చేందుకు గతేడాది సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ ట్యాక్స్‌ను నిర్మలా సీతారామన్‌ భారీగా తగ్గించిన సంగతి విదితమే. ఈ క్రమంలో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకూ పన్ను ప్రోత్సాహకాలుంటాయని అంతా భావిస్తున్నారు. కానీ పన్ను వసూళ్లు అంచనాలకు దిగువనే ఉండే వీలుండటం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మోదీ సర్కారు పెట్టుకున్న నిధుల సమీకరణ లక్ష్యాలు నెరవేరకపోవడం ఈ ఆశలపై నీళ్లు చల్లుతున్నది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను గడిచిన 28 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా 10 శాతం తగ్గించడంతో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం చేజారింది. కార్పొరేషన్‌ ఆదాయం పన్ను (సీఐటీ) రూ.7.66 లక్షల కోట్లుగా, వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.5.69 లక్షల కోట్లుగా 2019-20 బడ్జెట్‌లో అంచనా వేశారు. జీఎస్టీ ఆదాయాన్ని 6.63 లక్షల కోట్లుగా నిర్దేశించారు. కస్టమ్స్‌ రెవిన్యూను రూ.1.56 లక్షల కోట్లుగా, ఎక్సైజ్‌ రెవిన్యూను రూ.3 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24.59 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని బడ్జెట్‌లో కేంద్రం చెప్పింది. ఇందులో రాష్ర్టాల వాటా రూ.8.09 లక్షల కోట్లు, కేంద్రం వాటా రూ.16.50 లక్షల కోట్లుగా ఉన్నది. 


ఆటో ఎల్‌పీజీపై జీఎస్టీ తగ్గించాలి

ఆటో ఎల్‌పీజీపై జీఎస్టీని తగ్గించాలని భారతీయ ఆటో ఎల్‌పీజీ సంకీర్ణ కూటమి (ఐఏసీ) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల పర్యావరణహిత ఇంధనాలను ప్రోత్సహించినట్లవుతుందని, కాలుష్యరహిత వాహనాలకు ఊతమిచ్చినట్లవుతుందని ఐఏసీ డైరెక్టర్‌ జనరల్‌ సుయాశ్‌ గుప్తా అన్నారు. ‘ఆటో ఎల్‌పీజీ వంటి పర్యావరణహిత రవాణా ఇంధనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది’ అని అభిప్రాయపడ్డారు. ఆటో ఎల్‌పీజీపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ పడుతున్నది. 


ఎరువుల పరిశ్రమ కోసం..

రాబోయే బడ్జెట్‌లో ఎరువుల పరిశ్రమ కోసం ముడి ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయంగా తయారీని పెంచడం కోసం ఈ మేరకు నిర్ణయాలు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏపీ తయారీలో సల్ఫర్‌, రాక్‌ పాస్ఫేట్‌ వంటి ముడి పదార్థాలను వినియోగిస్తుండగా, వాటి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తే, దేశీయంగా ఉత్పత్తిని పెంచినట్లవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం వీటిపై 5 శాతం దిగుమతి సుంకం పడుతున్నది. దాదాపు 95 శాతం డీఏపీ అవసరాలు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌-డిసెంబర్‌లో 8.47 శాతం పెరిగి 6.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైయ్యాయి. 


logo
>>>>>>