సోమవారం 01 మార్చి 2021
Business - Feb 01, 2021 , 18:46:28

బ్యాంకులు దివాళా తీసినా.. డిపాజిటర్లకు రక్షణ

బ్యాంకులు దివాళా తీసినా.. డిపాజిటర్లకు రక్షణ

న్యూఢిల్లీ: బ్యాంకులు దివాళా తీసినప్పటికి డిపాజిటర్లకు రక్షణ కల్పించే ప్రతిపాదనను కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్నారు. బ్యాంకు కస్టమర్లు నిర్ణీత కాలంలో తమ డిపాజిట్లను పొందవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో హామీ ఇచ్చారు. బ్యాంక్ లిక్విడేట్ అయినప్పటికీ డిపాజిటర్లు తమ డిపాజిట్లను సులువుగా, సమయానుసారంగా పొందేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీని కోసం ప్రభుత్వ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ యాక్ట్ (డీఐసీజీసీ) 1961ను సవరించనున్నట్లు తెలిపారు. 

ఏదైనా బ్యాంకు తన డిపాజిటర్లకు వారు జమ చేసిన నగదును చెల్లించడంలో విఫలమైన పక్షంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు చెందిన డీఐసీజీసీ బాధిత డిపాజిటర్లకు సంబంధిత బీమాను అందజేస్తుంది. గత ఏడాది ఒక వ్యక్తికి డిపాజిట్ బీమా చెల్లించే మొత్తాన్ని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచారు. బ్యాంకు లైసెన్స్‌ రద్దు, సమ్మేళనం లేదా విలీనం లేదా పునర్నిర్మాణ పథకం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి రూ.5 లక్షల బీమాలోనే అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో బ్యాంకులో సంక్షోభం ఏర్పడినప్పుడు, బ్యాంకులు దివాళా తీసినప్పుడు డిపాజిటర్లు తమ డబ్బులు తిరిగి పొందటానికి చాలా కాలం నిరీక్షించాల్సి ఉంటుంది. పీఎంసీ బ్యాంక్ డిపాజిటర్లు తమ డబ్బుల కోసం ఇంకా పోరాడుతుండటమే దీనికి ఉదాహరణ.

అయితే ప్రభుత్వ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ యాక్ట్ (డీఐసీజీసీ) 1961 సవరణతో డిపాజిటర్లకు ఈ కష్టాలు తొలగనున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో డిపాజిటర్లు తమ బీమాను పొందే అవకాశం కలుగుతుంది. బ్యాంకు డిపాజిటర్లకు ఇది సానుకూల పరిణామమని విశ్లేషకులు తెలిపారు. ఖాతాలు స్తంభింపజేసిన కస్టమర్లు కూడా బీమా పరిమితి వరకు నిధులను పొందే అవకాశం ఉన్నదని చెప్పారు. ఈ మధ్యకాలంలో బ్యాంకులపై ఆర్బీఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు లేదా డిపాజిట్ల ఉపసంహరణపై పరిమితి విధించినప్పుడు కస్టమర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాజా హామీతో ఇకపై బ్యాంకు కస్టమర్ల డిపాజిట్లకు రక్షణ లభిస్తుందని వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo