e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home బిజినెస్ నాలుగు మినహా అన్నింటినీ అమ్మేస్తాం

నాలుగు మినహా అన్నింటినీ అమ్మేస్తాం

నాలుగు మినహా అన్నింటినీ అమ్మేస్తాం
 • నష్టదాయక పీఎస్‌యూలను వదిలించుకోవాల్సిందే
 • వారసత్వంగా వస్తున్నాయని వాటిని నడపలేం
 • వాటికి తోడ్పాటునివ్వడం సాధ్యం కాదు
 • అలా చేయడం ఆర్థిక వ్యవస్థకు పెనుభారమే
 • వ్యాపారం చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు
 • ప్రజా సంక్షేమమే సర్కార్‌కు ప్రథమ ప్రాధాన్యం
 • 4 రంగాలు మినహా అన్ని సంస్థలను ప్రైవేటీకరిస్తాం
 • ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్ని వదిలించుకోక తప్పదు ఆధునీకరించడం, సంపదను సృష్టించడం’ మా ప్రభుత్వ నినాదం. భారీ పెట్టుబడులు, ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను, టాప్‌ క్వాలిటీ మేనేజర్లను, ఆధునిక టెక్నాలజీని తీసుకురావడం ప్రైవేట్‌ రంగంతోనే సాధ్యం

ప్రధాని మోదీ

వారసత్వంగా వస్తున్నాయని నడుపలేం వాటికి తోడ్పాటునివ్వడం సాధ్యంకాదు అలా చేస్తే ఆర్థిక వ్యవస్థకు పెనుభారమే అమ్మేస్తే 2.5 లక్షల కోట్లు నిధులొస్తాయి వాటన్నింటినీ సంక్షేమానికి వెచ్చిస్తాం అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు వ్యాపారం ప్రభుత్వ వ్యవహారం కాదు తేల్చి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రభుత్వ రంగంలోని పలు సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగంలోని కీలకేతర సంస్థలను ప్రైవేటీకరించాల్సిందేనని ఉద్ఘాటించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లను అలాగే నడపడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారమేనని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో వాటిని నడపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలే తప్ప ప్రజా ధనంతో వ్యాపారం చేయకూడదని గట్టిగా అభిప్రాయపడ్డారు. సార్వత్రిక బడ్జెట్‌ 2021-22లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాల అమలుపై బుధవారం జరిగిన ఓ వెబినార్‌లో మోదీ ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిన 50-60 ఏండ్ల నాటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు వేరన్నారు.

 ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడమే ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరమున్నదన్నారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు (అణు శక్తి-ఖగోళ, రక్షణ, రవాణా-టెలీకమ్యూనికేషన్లు, విద్యుత్‌-పెట్రోలియం-బొగ్గు-ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్‌-బీమా-ఆర్థిక సేవలు) మినహా మిగిలిన అన్ని రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రకటించారు. ఇప్పటికే చమురు, గ్యాస్‌, విద్యుత్‌ లాంటి వివిధ రంగాల్లోని దాదాపు 100 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను సరిగా ఉపయోగించుకోలేకపోయామన్నారు. వీటిని నగదీకరించడం ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుందని చెప్పారు. 

నాలుగు మినహా అన్నింటినీ అమ్మేస్తాం

సెంటిమెంట్లతో నడపలేం..

‘ప్రభుత్వ రంగంలోని పలు సంస్థలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిలో కొన్నింటికి పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో తోడ్పాటునందించాల్సి వస్తున్నది. పేద ప్రజలు హక్కుదారులుగా ఉన్న సొమ్మును, ఎన్నో ఆకాంక్షలతో ఉన్న యువత డబ్బును నష్టాల్లో కూరుకుపోయిన పీఎస్‌యూల కోసం వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతున్నది. వారసత్వంగా వస్తున్నాయనో, చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయనో, కొందరి కలల ప్రాజెక్టులనే కారణాలతోనో లేక ఇతర సెంటిమెంట్లతోనో ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించరాదు. ప్రభుత్వం స్వయంగా సంస్థలను నడపడం, వాటికి యజమానిగా ఉండటం ప్రస్తుత కాలంలో అవసరం లేదు. అలా చేయడం ప్రభుత్వానికి సాధ్యం కూడా కాదు. కనుక వ్యాపాల వ్యవహారాల్లో ప్రభుత్వం భాగస్వామిగా ఉండరాదన్నది నా నిశ్చితాభిప్రాయం’ అని మోదీ పేర్కొన్నారు.

ఆ నిధులన్నీ సంక్షేమ పథకాలకే..

‘ఆధునీకరించడం, సంపదను సృష్టించడం’ అనే నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు మోదీ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో పెట్టుబడులను, ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను, టాప్‌ క్వాలిటీ మేనేజర్లను, మేనేజ్‌మెంట్‌లో మార్పులను, ఆధునిక టెక్నాలజీని తీసుకురావడం ప్రైవేట్‌ రంగంతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్మడం ద్వారా వచ్చే నిధులను విద్య, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు, శానిటైజేషన్‌ లాంటి ప్రజా సంక్షేమ పథకాలకు వెచ్చించనున్నట్లు తెలిపారు.

సాధికార గ్రూపు ఏర్పాటు

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించే ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే కార్యదర్శులతో సాధికార గ్రూపును ఏర్పాటు చేసినట్లు మోదీ తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో వివిధ పీఎస్‌యూల్లోని ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, పవన్‌ హన్స్‌ లాంటి సంస్థలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ పెట్టుబడిదారుల నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే పలు బిడ్లు వచ్చాయి. 

ఈ పీఎస్‌యూలన్నీ  ప్రైవేట్‌పరమే

 • భారత్‌ పెట్రోలియం
 •  ఎయిర్‌ ఇండియా
 • షిప్పింగ్‌ కార్పొరేషన్‌
 •  పవన్‌ హన్స్‌
 • కంటైనర్‌ కార్పొరేషన్‌
 • ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా
 •  సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌
 •  స్కూటర్స్‌ ఇండియా
 • హిందుస్థాన్‌ న్యూస్‌ప్రింట్‌
 •  ఐటీడీసీ
 • సిమెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా   మరో 15 సంస్థలు కూడా..

పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు 
సమీకరించాలని లక్ష్యం

 • పబ్లిక్‌ ఇష్యూకు ఎల్‌ఐసీ
 • రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ
 • జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థకూ గుడ్‌బై
 • అమ్మకానికి ప్రభుత్వ రంగంలోని అప్రాధాన్య, నిరుపయోగ ఆస్తులు
 • చమురు, గ్యాస్‌, విద్యుత్‌, ఇతర రంగాల్లో 100 ఆస్తుల నగదీకరణ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాలుగు మినహా అన్నింటినీ అమ్మేస్తాం

ట్రెండింగ్‌

Advertisement