సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 04, 2020 , 23:53:30

ఎన్నారైల చేతికి

ఎన్నారైల చేతికి
  • ఎయిర్‌ ఇండియాలో 100% వాటా కొనుగోలుకు అనుమతి
  • కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 4: ఎయిర్‌ ఇండియాను పూర్తిస్థాయిలో దక్కించుకునే అవకాశం.. ప్రవాస భారతీయులకు (ఎన్నారై) వచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలో 100 శాతం వరకు వాటా కొనుగోలుకు ఎన్నారైలు అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం బిడ్లను కోరుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ‘ఎయిర్‌ ఇండియాపై నేటి నిర్ణయం ఓ మైలురాయి. సంస్థలో 100 శాతం పెట్టుబడులకు ఎన్నారైలు అనుమతిని పొందారు’ అని క్యాబినెట్‌ నిర్ణయాన్ని గురించి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ఎయిర్‌ ఇండియా వ్యూహాత్మక విక్రయంలో పాల్గొనడానికి ఎన్నారైలకూ అవకాశం వచ్చిందన్నారు. ఇప్పుడు వారు ఎయిర్‌ ఇండియా మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చని చెప్పారు. ఎన్నారై పెట్టుబడులను దేశీయ పెట్టుబడులుగానే పరిగణిస్తామన్నారు. ఇది ఎస్‌ఓఈసీ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని చెప్పుకొచ్చారు.


 ఇంతకుముందు ఎయిర్‌ ఇండియాలో ఎన్నారైలకు కేవలం 49 శాతం వాటానే పొందే వీలున్నది. ప్రభుత్వ ఆమోదిత మార్గం ద్వారా కూడా ఎయిర్‌ ఇండియాలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకే (ఎఫ్‌డీఐ) అనుమతి ఉన్నది. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం కొన్ని నియమాలకు లోబడి షెడ్యూల్డ్‌ దేశీయ విమానయాన సంస్థల్లో ఎన్నారైలకు 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతినిచ్చారు. ఎయిర్‌ ఇండియాలో విదేశీ ఎయిర్‌లైన్స్‌, ఇతర విదేశీ పెట్టుబడులకున్న 49 శాతం పరిమితిని మాత్రం అలాగే ఉంచారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదని జవదేకర్‌ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడానికి దోహదం చేయగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మంత్రి వ్యక్తం చేశారు. కాగా, 2000 నుంచి 2014 వరకు దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 360 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని, 2014 నుంచి 2019 వరకు 282 బిలియన్‌ డాలర్లు పెరిగి 642 బిలియన్‌ డాలర్లకు చేరాయని చెప్పారు. మరోవైపు భారతీయ సంస్థలు విదేశాల్లోని స్టాక్‌ మార్కెట్‌లలో నేరుగా నమోదు అయ్యేందుకు ఈ సందర్భంగా క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 


కంపెనీల చట్టానికి మరిన్ని సవరణలు


కంపెనీల చట్టానికి మరిన్ని సవరణలు చేసేందుకు క్యాబినెట్‌ అనుమతినిచ్చింది. ‘కంపెనీల చట్టం 2013లో 72 మార్పులను చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం లభించింది’ అని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 23 రకాల నేరాలనూ చట్టం పరిధి నుంచి తప్పించామని చెప్పారు. జరిమానాలనూ తగ్గించామన్న మంత్రి.. సీఎస్‌ఆర్‌ ఆబ్లిగేషన్‌ రూ.50 లక్షలకు దిగువన ఉంటే.. సీఎస్‌ఆర్‌ కమిటీ అక్కర్లేదన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడానికే చట్టంలో మార్పులు చేశామని వివరించారు.


1 నుంచి అమల్లోకి బ్యాంకుల విలీనం 

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ విలీన ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం లభించిందని చెప్పారు. ఎలాంటి సమస్యలూ లేవన్నారు. ప్రపంచ శ్రేణి బ్యాంకుల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎస్బీఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంక్‌ను కలిపేసిన మోదీ సర్కారు.. గతేడాది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా, దేనా బ్యాంక్‌లనూ ఏకం చేసిన సంగతి విదితమే.


ఈ క్రమంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లను, కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌ను, ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ను, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను కలిపేస్తున్నారు. విలీనాల అనంతరం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనున్నది. దీని వ్యాపార పరిమాణం రూ.17.94 లక్షల కోట్లకు చేరుతుంది. రూ.52 లక్షల కోట్లకుపైగా వ్యాపారంతో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉన్నది. ఇక ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. మూడో స్థానానికి పరిమితం కానున్నది. తర్వాతి స్థానాల్లో కెనరా, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌, యూకో, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లుంటాయి.


logo