వచ్చే రెండేండ్లలోఆర్థికం పరుగులు

- 2021-22లో 11 శాతానికి జీడీపీ వృద్ధి
- ఈ ఆర్థిక సంవత్సరంలో 7.7% క్షీణత
- లాక్‌డౌన్‌తో వ్యవసాయం మినహా అన్ని రంగాలు కుదేలు
- ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి
- ఆర్థిక సర్వే 2020-21 స్పష్టీకరణ
- కరోనా వారియర్స్‌కు ఆర్థిక సర్వే అంకితం
దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పూర్వ స్థితికి చేరుకుని వృద్ధి బాటలో పరుగులు తీసేందుకు రెండేండ్ల సమయం పడుతుందని ఆర్థిక సర్వే 2020-21 స్పష్టం చేసింది. ఈ మహమ్మారి ధాటికి వ్యవసాయం మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయని తెలిపింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటులో 7.7 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేసింది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ‘వీ’ ఆకారంలో కోలుకుంటున్నదని, దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 11 శాతానికి పుంజుకుంటుందని అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రికార్డు స్థాయిలో 7.7 శాతం క్షీణిస్తుందని ఆర్థిక సర్వే-2020-21 పేర్కొన్నది. కరోనా లాక్డౌన్ ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. రానున్న రెండేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పరుగులు తీస్తుందని, తద్వారా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ‘వీ’ ఆకారంలో కోలుకుంటున్నదని తెలిపింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో జీడీపీ 11 శాతానికి పుంజుకుని రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. 1979-80లో దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్ 5.2 శాతానికి క్షీణించిందని, ఇప్పటి వరకు ఇదే భారీ క్షీణత అని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించే ఈ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీనిని డిజిటల్ మాధ్యమంలో కూడా విడుదల చేశారు. దీర్ఘ కాలంలో దేశ ఉత్పాదక సామర్థ్యానికి నష్టం వాటిల్లకుండా నిరోధించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని సర్వే కొనియాడింది. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సిన్లు క్రమంగా అందుబాటులోకి వస్తుండటంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, వీటితోపాటు సరఫరా రంగానికి, మౌలిక వసతులకు సబందించిన పెట్టుబడులకు ఊతమివ్వడం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, సేవా రంగంలో డిమాండ్ పుంజుకోవడం, వడ్డీ రేట్లను తగ్గించడం, రుణాల పంపిణీ ఊపందుకోవడం లాంటి అంశాలు జీడీపీకి మరింత ఊతమిస్తాయని వివరించింది. ఈ సర్వేను కొవిడ్-19 పోరాట యోధులకు అంకితమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ తెలిపారు. అనంతరం ఆయన ఆర్థిక సర్వేకి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్లీ కోలుకుంటుందని, కానీ ప్రజలు ప్రాణాలను కోల్పోతే ఎప్పటికీ తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని చెప్పారు. తద్వారా దేశంలో దాదాపు 37 లక్షల కొవిడ్-19 కేసులను తగ్గించడంతోపాటు లక్ష మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు.
వ్యవసాయం మినహా అన్ని రంగాలు కుదేలు
కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయడంతో వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయని, ముఖ్యంగా తయారీ, సేవా రంగాలు తీవ్రంగా నష్టపోయాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మాత్ర మే సానుకూల వృద్ధి రేటును నమోదు చేస్తుందని తెలిపింది. ఈ వృద్ధి రేటు 3.4 శాతంగా ఉండవచ్చని పేర్కొన్నది. తయారీ రంగ వృద్ధి రేటు -9.6 శాతం, సేవల రంగంలో -8.8 శాతానికి క్షీణించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ ఖాతా మిగులు దాదాపు 17 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరవచ్చని అభిప్రాయపడింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 1 శాతం నుంచి 3 శాతానికి పెంచాలని కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆసుపత్రి ఖర్చులు 65 శాతం నుంచి 35 శాతానికి తగ్గుతాయన్నది.
ఆరోగ్య సంరక్షణ
ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట దక్కాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని పేర్కొన్నది. హెల్త్‌కేర్‌పై పెరిగే ప్రభుత్వ వ్యయంతో ప్రజల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేసింది. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య విధానంపై దృష్టి పెట్టడం వల్ల పేద మహిళలకు ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఆరోగ్య రక్షణ లభించినట్లవుతుందన్నది. ఇక సమాచార లోపాన్ని అధిగమించడం వల్ల ఇన్సూరెన్స్‌లూ పెరుగుతాయని తెలిపింది. మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, తాగునీటి వసతుల కల్పనతో అంటువ్యాధులను అరికట్టవచ్చని వివరించింది. కాగా, మెరుగైన, నాణ్యమైన వైద్యం విషయంలో 180 దేశాల సర్వేలో భారత్‌కు 145వ స్థానం దక్కడం గమనార్హం.
రేషన్ ధరలు పెంచాలి
నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు) ద్వారా అందిస్తున్న రాయితీ నిత్యావసరాల ధరలను పెంచాలని ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సబ్సిడీ ప్రభుత్వానికి పెను భారంగా మారుతున్నదని తెలిపింది. అయితే ప్రభుత్వాలు ఆహార భద్రతకు కట్టుబడి ఉన్నందున సెంట్రల్ ఇష్యూ ప్రైస్ (సీఐపీ)ను సవరించాలని పేర్కొన్నది. దేశంలోని 80 కోట్లకుపైగా జనాభా.. రేషన్ షాపుల్లో నుంచి చౌక ధరలకే బియ్యం, గోధుమలు, పప్పులు, కిరోసిన్‌ను పొందుతున్నారు. పీడీఎస్ ద్వారా కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, ముతక ధాన్యం రూ.1కే రేషన్ షాపులు సరఫరా చేస్తున్నాయి.
లాక్డౌన్ డివిడెండ్
కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన చర్యలు భారత్‌కు కలిసొచ్చాయని ఆర్థిక సర్వే పేర్కొన్నది. లాక్‌డౌన్‌తో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయని, జీవనోపాధులకూ రక్షణ లభించిందంటూ దీన్ని లాక్డౌన్ డివిడెండ్‌గా అభిప్రాయపడింది. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం జాతికి స్వల్పకాలిక నష్టం భరించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది. కొవిడ్-19తో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద కష్టమే వచ్చిపడిందని, అయితే దీన్నుంచి త్వరగానే తేరుకోగలిగామని చెప్పింది. స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరత్వాన్ని సంతరించుకున్నాయని, రూపాయి విలువ, కరెంట్ ఖాతా లోటు నిలకడగా ఉన్నాయన్నది.
పట్టాలెక్కిన రియల్ ఎస్టేట్
కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన దేశీయ నిర్మాణ రంగం.. తిరిగి కోలుకుంటున్నదని ఆర్థిక సర్వే వెల్లడించింది. గతేడాది ఏప్రిల్-జూన్‌లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, లావాదేవీలు స్తంభించిపోయాయని, అయితే జూలై నుంచి సరసమైన ధరల్లో లభించే గృహాలకు డిమాండ్ పెరిగిందని చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద గతేడాది నిర్మాణ రంగానికి పలు ప్రోత్సాహకాలు దక్కాయన్నది.
2019-20లో వృద్ధి 4 శాతమే
గడిచిన ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధిరేటును మరింత తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 2019-20లో వృద్ధి 4 శాతానికి పరిమితం చేసింది. గతంలో 4.2 శాతంగా ఉంటుందని వెల్లడించింది. 2011-12 గణాంకాల ప్రకారం 2019-20లో రూ.145.69 లక్షల కోట్లు కాగా, 2018-19లో రూ.140.03 లక్షల కోట్లుగా ఉన్నట్లు జాతీయ గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. 2018-19లో జీడీపీలో 6.5 శాతం వృద్ధి నమోదైంది. గనులు, తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసులు తక్కువ వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే వృద్ధి అంచనాను సవరించినట్లు తెలిపింది. అలాగే నామినల్ నెట్ నేషనల్ ఇన్‌కం(ఎన్ఎన్ఐ) 2019-20లో రూ.179.94 లక్షల కోట్లు ఉండగా, అంతక్రితం ఏడాది రూ.167.05 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు, 2019-20లో భారతీయుల తలసరి ఆదాయంరూ.1,34,186గా నమోదైంది. అంతక్రితం ఇది రూ.1,25,883గా ఉన్నది.
ఎగుమతుల్లో క్షీణత!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించే అవకాశాలున్నాయని ఆర్థిక సర్వే అంచనావేస్తున్నది. సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఎగుమతులు 5.8 శాతం తగ్గనుండగా, ఇదే సమయంలో దిగుమతులు 11.3 శాతం మేర తగ్గనున్నాయని సర్వే వెల్లడించింది. తొలి ఆరు నెలలు(ఏప్రిల్-సెప్టెంబర్) మధ్యకాలంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 21 శాతం తగ్గి 125.25 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, దిగుమతులు కూడా 40 శాతం తగ్గి 148.69 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా గతేడాది ఎగుమతులు నీరసించాయని సర్వే పేర్కొంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయని, వచ్చే ఏడాది మాత్రం పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. ‘2022-23 నుంచి 2028-29 వరకు ఏటా దేశ జీడీపీ వృద్ధిరేటు కనిష్ఠంగా 3.8 శాతంగానే నమోదైనా.. భారత రుణ భారం మాత్రం తగ్గుతూనే ఉంటుంది. మౌలిక రంగంపై విస్తృత ఆర్థిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది’
-కేవీ సుబ్రమణియన్
9-12కు వృత్తి విద్యా కోర్సులు
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కింద విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను పరిచయం చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు దశలవారీగా వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరమున్నదని పేర్కొన్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచే కౌశల్ వికాస్ యోజన ప్రారంభమవగా, 8 లక్షల మందికి నైపుణ్యం అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కాగా, దేశంలోని కార్మికుల్లో 15 నుంచి 59 ఏండ్ల వయసువారిలో చదువు ద్వారా వృత్తిపరమైన నైపుణ్యం సంపాదించినవారు కేవలం 2.4 శాతం మందేనని సర్వే తెలిపింది. వీరిలో అధికులు ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో శిక్షణ పొందినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్-పవర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఆఫీస్, బిజినెస్ సంబంధిత పనుల కోర్సులను నేర్చుకున్నారు. మరో 8.9 శాతం మంది పనుల్లో చేరి, సొంతంగా, వంశ పారంపర్యంగా, ఇతర మార్గాల్లో నైపుణ్యం పొందారని వివరించింది.
ఈ-ఎడ్యుకేషన్ భేష్
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకుంటే విద్యా విధానంలో అసమానతల్ని తగ్గించవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. వార్షిక విద్యా నివేదిక 2020 తొలి దశ (గ్రామీణం) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంఖ్య గతేడాది 61.8 శాతానికి పెరిగింది. 2018లో ఇది కేవలం 36.5 శాతమే. ఈ క్రమంలోనే ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకుంటే పట్టణ, గ్రామీణ విద్యార్థుల మధ్యగల అన్ని రకాల అసమానతల్ని భారీగా తగ్గించవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది.
పీఎం-జేఏవైకి జై
ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) పథకాన్ని అమలుపర్చిన రాష్ర్టాల్లో మెరుగైన ఫలితాలున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఈ పథకానికి దూరంగా ఉన్న రాష్ర్టాలతో పోల్చితే శిశు, బాల మరణాల రేటు తగ్గిందని, కుటుంబ నియంత్రణ సేవల వినియోగం బాగుందని, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించిన అవగాహన పెరిగిందని వెల్లడించింది. అలాగే పీఎం-జేఏవైలతో ఆయా రాష్ర్టాల్లో గృహస్తుల ఆరోగ్య బీమాలు 54 శాతం పెరిగాయన్నది. ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై లబ్ధిదారులు దాదాపు 50 కోట్ల మంది ఉన్నారని వివరించింది. ప్రస్తుతం 32 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమల్లో ఉందని, ఇప్పటిదాకా రూ.7,490 కోట్ల విలువైన వైద్య చికిత్సలు పొందారని, 24,215 ఆస్పత్రులకు ఈ పథకంలో భాగస్వామ్యం ఉందని సర్వే స్పష్టం చేసింది.
ఎవరేమన్నారు?
‘గడ్డుకాలం ముగిసింది.. వృద్ధి పట్టాలెక్కింది అంటూ సర్వే పునరుద్ఘాటించింది. అయితే అందరికీ వ్యాక్సిన్, సేవా రంగం పురోగతితోనే జీడీపీకి అసలు సిసలు బలం’
-చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
‘రాబోయే బడ్జెట్‌ను ఈ సర్వే
ప్రతిబింబిస్తున్నది. అయితే ప్రభుత్వం నుంచి అన్ని రంగాలకు మద్దతు కొనసాగాలి. జాతి అవసరాల కోసం కేంద్రం ఉదారంగా స్పందించాలి’
-ఉదయ్ శంకర్, ఫిక్కీ అధ్యక్షుడు
‘వచ్చే ఆర్థిక సంవత్సరంపై సర్వే రూపకర్త సుబ్రమణ్యన్ చాలా ఆశాభావంతో కనిపించారు. నిజంగానే కరోనా వైరస్‌ను అందరం కలిసి అంతమొందిస్తే ఆకర్షణీయమైన వృద్ధిరేటు సాధ్యమే’
-దీపక్ సూద్, అసోచామ్ ప్రధాన కార్యదర్శి
ఆర్థిక సర్వేలోని ప్రధానాంశాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించే ఆర్థిక సర్వే 2020-21ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సర్వేలోని ముఖ్యాంశాలు ఇవీ..
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.7% క్షీణించవచ్చు.
- కొవిడ్-19 వల్ల వ్యవసాయం మినహా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇలాంటి పరిస్థితి వందేండ్లలో ఒకసారి వస్తుంది.
- వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో జీడీపీ వృద్ధి రేటు 11 శాతానికి పుంజుకోవచ్చు.
- కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయి.
- దేశంలో తగినన్ని విదేశీ మారకద్రవ్య నిల్వలున్నాయి.
- తయారీ రంగం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి.
- ఈ ఆర్థిక సంవత్సర ద్వితీయార్థం (అక్టోబర్-మార్చి)లో ఎగుమతులు 5.8 శాతం, దిగుమతులు 11.3 శాతం తగ్గవచ్చు.
- ఏడాది క్రితంతో పోలిస్తే 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 34% పెరిగాయి.
- కొవిడ్-19 సంక్షోభం పీడిస్తున్నప్పటికీ గతేడాది 12 స్టార్టప్‌లు యూనికార్న్ జాబితాలో చేరాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా మిగులు జీడీపీలో 2 శాతానికి చేరవచ్చు. ఇది 17 ఏండ్ల గరిష్ఠ స్థాయి.
- దేశ సార్వభౌమ రుణ పరపతి రేటింగ్ విషయంలోవిదేశీ రేటింగ్ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలి.
- గతేడాది నవంబర్‌లో 9.8 బిలియన్ డాలర్ల నికర విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆల్‌టైమ్ రికార్డు.
ప్రజారోగ్య పరిరక్షణకు..
- కొవిడ్-19 నుంచి ప్రజలను రక్షించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ర్టాలు ముందున్నాయి. ఈ మూడు రాష్ర్టాలు ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాయి.
- ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచాలి.
- కరోనా లాంటి మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపర్చాలి.
- ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా టెలీ మెడిసిన్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరమున్నది.
సంస్కరణలు
- రుణాల రికవరీ కోసం చట్టాలను బలోపేతం చేయాలి.పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్యక్రమాలకు భారీగా పెట్టుబడులు పెట్టాలి.
- రెగ్యులేటరీ (నియంత్రణ) నిబంధనలను సరళీకరించాలి.
- నిర్ణయ, పర్యవేక్షణ విధానాల్లో మరింత పారదర్శకత అవసరం.
తాజావార్తలు
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..