బుధవారం 03 జూన్ 2020
Business - Mar 31, 2020 , 23:44:06

డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలు మిస్‌

డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలు మిస్‌

-2019-20లోసేకరించింది 50 వేల కోట్లు

వరుసగా రెండేండ్లుగా డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను అధిగమించిన నరేంద్ర మోదీ సర్కార్‌కు గతేడాది కరోనా వైరస్‌ గండికొట్టింది. 2019-20లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా బడ్జెట్‌లో లక్ష కోట్లకు పైగా సేకరించాలని భావించిన సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సవరించిన అంచనాకు కూడా రూ.14,700 కోట్ల దూరంలో నిలిచిపోయింది. రూ.65 వేల కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ రూ.50,298.64 కోట్లు మాత్రమే వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగా ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో రూ.1.05 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆ తర్వాతి క్రమంలో దీనిని రూ.65 వేల కోట్లకు కుదించింది. దీంతో టీహెచ్‌డీసీ, నెప్కోలను ఎన్‌టీపీసీకి విక్రయించడంతో రూ.11,500 కోట్లు సమకూరగా, కామరాజర్‌ పోర్ట్‌ను చెన్నై పోర్ట్‌ ట్రస్ట్‌కు అమ్మడంతో రూ.2,383 కోట్లు, అలాగే రెండు ఫాల్లో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా మరో రూ.26,500 కోట్లు, భారత్‌-22 ఈటీఎఫ్‌ల ద్వారా రూ. 4,368 కోట్లు లభించాయి. వీటితోపాటు ఆర్‌వీఎన్‌ఎల్‌, ఐఆర్‌సీటీసీను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయడంతో కేంద్రానికి రూ. 1,113 కోట్లు, మోయిల్‌, ఎండీఎల్‌, ఎస్‌పీఎంసీఐఎల్‌ బైబ్యాక్‌ల ద్వారా మరో వెయ్యి కోట్లు సమకూరాయి. మరోవైపు ఏప్రిల్‌1 నుంచి అమలులోకి రానున్న  2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.10 లక్షల కోట్ల నిధులను డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా సేకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 

రూపాయిదీ అదే దారి

2019-20 ఆర్థిక సంవత్సరంలో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 9.36 శాతం దిగజారింది. ఏకంగా 6.46 రూపాయలు కోల్పోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 69.14 వద్ద రూపాయి వీడ్కోలు పలికింది. మంగళవారం 75.60 వద్ద ముగిసింది. దీంతో 2019-20లో రూపాయి మారకం విలువ 6.46 తరిగిపోయినైట్లెంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, దేశీయ ఆర్థిక మందగమనం రూపాయి విలువను దిగజార్చిందని ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు మంగళవారం రూపాయి మారకం విలువ స్థిరంగా ఉన్నది. సోమవారం ముగింపుతో పోల్చితే కేవలం ఒక్క పైసానే తగ్గింది.

రూ.4.88 లక్షల కోట్ల అప్పు

బుధవారం నుంచి అమలుల్లోకి  వచ్చిన నూతన ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కేంద్రం రూ.4.88 లక్షల కోట్ల మేర రుణాన్ని తీసుకోనున్నది. కరోనాతో సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు డీఈఏ కార్యదర్శి అతాను చక్రవర్తి తెలిపారు. 2020-21 సంవత్సరానికిగాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.7.8 లక్షల కోట్లు అప్పు చేయాల్సి రావచ్చునని చెప్పారు. 2019-20లో చేసిన రూ.7.1 లక్షల కోట్ల కంటే ఇది అధికం. ద్రవ్య లోటును కట్టడి చేయడానికి  మార్కెట్ల నుంచి రుణాలను సేకరిస్తున్నది. 


logo