కొంతమంది పిల్లలు త్వరగా భయపడతారు. చిన్నపాటి శబ్దాలకే ఉలిక్కిపడతారు. ఇంకొందరు ఉరుములు వినిపిస్తున్నా కలవరపడరు. స్వభావరీత్యా ఇలాంటి తేడాలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ, ‘పిల్లలు భయపడే స్థాయిని అంచనా వేయవచ్చా? ఆ అంచనాను బట్టి భవిష్యత్తులో వారు ఎదుర్కొనే మానసిక సమస్యలను ఊహించవచ్చా?’ అనే ఆలోచన మిషిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులకు వచ్చింది. ఈ అంచనాల కోసం వీరు ఓ ఆశ్చర్యకరమైన విధానాన్ని ఎంచుకున్నారు. మన జీర్ణాశయంలో బ్యాక్టీరియా ఉంటుందని తెలిసిందే కదా! ఇది కేవలం మన జీర్ణక్రియను మాత్రమే శాసించదు, ఒక్కోసారి శరీర తత్వాన్ని చెప్పేస్తుంది. అంతేనా, మనం స్పందించే తీరునుకూడా సూచించగలదనే అనుమానం వారికి వచ్చింది. దీనికోసం ఓ 30 మంది పిల్లలకు ఎమ్ఆర్ఐ స్కాన్ జోడించి, ఆ సమయంలో వారికి భయంకరమైన మాస్కులు ధరించిన వ్యక్తులను చూపించారు. వారి భయ తీవ్రతకు, వారి జీర్ణవ్యవస్థలోని microbiome అనే సూక్ష్మజీవుల సంఖ్యకు ఏదో లంకె ఉండటాన్ని గమనించారు. మున్ముందు వీటి ఆధారంగా పిల్లల్లో మానసిక సమస్యలను, పెద్దయ్యాక కలిగే ఇబ్బందులను అంచనా వేయవచ్చని నిపుణులు తేల్చారు.