బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 08, 2020 , 11:49:56

ఖర్చుల్ని తగ్గిద్దాం!

ఖర్చుల్ని తగ్గిద్దాం!
  • -వ్యయ నియంత్రణపై కేంద్రం దృష్టి
  • -ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్లు పడిపోయిన ఆదాయం
  • -ద్రవ్యలోటు లక్ష్యాల సాధన కష్టమే

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.2 లక్షల కోట్ల ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ దిశగా అడుగులను ప్రారంభించింది కూడా. ఆసియా దేశాల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌.. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో ఆరేండ్ల కనిష్ఠ స్థాయిలో 4.5 శాతం వృద్ధిరేటును చవిచూసిన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ రంగ పెట్టుబడుల కొరత వేధిస్తుండగా, ఆర్థిక మందగమన పరిస్థితులకు అనుగుణంగా ఖర్చుల్ని తగ్గించుకుంటే ఉత్తమమన్న భావనకు మోదీ సర్కారు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు రెవిన్యూ దాదాపు రూ.2.5 లక్షల కోట్లు క్షీణించిందని, దీంతో ఈసారి కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించడం కష్టమేనన్న అభిప్రాయాలు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం వ్యయ లక్ష్యం రూ.27.86 లక్షల కోట్లుగా ఉన్నది. ఇందులో సుమారు 65 శాతం నవంబర్‌ నాటికే పూర్తయ్యింది. నిజానికి అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ప్రభుత్వ ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. వ్యయ లక్ష్యంలో కనీసం రూ.2 లక్షల కోట్లనైనా తగ్గించుకోవాలని మోదీ సర్కారు భావిస్తున్నది. ఇది దాదాపు 7 శాతానికి సమానం. దీంతో రాబోయే నెలల్లో ప్రభుత్వ వ్యయం మరింత తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అప్పుడే జీడీపీలో ద్రవ్యలోటును కట్టడి చేయగలమని కేంద్రం అనుకుంటున్నది. ఈసారి జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికే అదుపు చేయాలని సర్కారు యోచిస్తున్నది. ఇంతకుముందు ఈ లక్ష్యం 3.3 శాతంగా ఉన్నది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య 3.8 శాతానికి పెంచారు. డిమాండ్‌ కొరత, మార్కెట్‌లో స్తబ్ధత, కార్పొరేట్‌ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు పేలవంగా నమోదవుతుండటం వంటివి పన్ను వసూళ్లను ఆటంకపరుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు మరింతగా తగ్గితే.. జీడీపీ ఇంకా దిగజారడం ఖాయమని ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌ ప్రధాన ఆర్థికవేత్త రూపా రెగే అన్నారు.


ఫలించని ప్రయత్నాలు

వృద్ధిరేటు పురోగతి కోసం నిరుడు ఫిబ్రవరి నుంచి వరుస ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను 135 బేసిస్‌ పాయింట్ల మేర రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టిన సంగతి విదితమే. అయినప్పటికీ ఫలితం శూన్యం. చివరకు మళ్లీ విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గత నెల ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్ల కోతలకు ఆర్బీఐ విరామం ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాక ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ అంచనాను 5 శాతంగానే పేర్కొన్నది. ఇది గడిచిన దశాబ్ద కాలంలో అత్యంత కనిష్ఠం కావడం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం అనూహ్యంగా కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గించింది. అయినప్పటికీ ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు పుంజుకోలేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నిరాశాజనకంగా నమోదవుతుండటం కేంద్రాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నదిప్పుడు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కాస్త ఆకట్టుకున్నా.. ఈ జనవరి-మార్చి నెలల్లో ఎలా ఉంటాయన్నదానిపై ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నది.


logo