శుక్రవారం 05 జూన్ 2020
Business - May 14, 2020 , 02:01:46

చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్లు

చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్లు

 • పూచీకత్తు లేకుండానే రుణాలు.. 
 • రుణదాతలకు ప్రభుత్వ గ్యారంటీ
 • చెల్లింపులపై ఏడాది మారటోరియం.. 
 • ఏడాది మారటోరియం 
 • రుణ ఎగవేతదారులకూ రూ.20 వేల కోట్ల సాయం
 • ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు మూడు లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందజేయనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. దీనివల్ల 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రుణదాతలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుందని చెప్పారు.     నాలుగేండ్ల కాలపరిమితితో ఉండే ఈ రుణాలపై ఏడాది మారటోరియం కూడా వర్తించనున్నది. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎం ఈలకు 3 నెలలపాటు ప్రభుత్వమే ఈపీఎఫ్‌ చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.2,500 కోట్లను కేటాయించింది. ఉద్యోగులు చెల్లించాల్సిన ఈపీఎఫ్‌ విరాళ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు గడువును నవంబర్‌ 30 వరకు పొడిగించారు. అలాగే టీడీఎస్‌/టీసీఎస్‌ రేట్లనూ పరిమిత కాలానికిగాను 25% తగ్గిస్తామని చెప్పారు. అయితే.. వేతనేతర చెల్లింపులకు మాత్రమే ఇది వర్తిస్తుందని మెలికపెట్టారు. 

న్యూఢిల్లీ, మే 13: కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల కోసం కేంద్రం రూ.3 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను ప్రకటించింది. మహమ్మారి ధాటికి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు మలి విడుత ఉద్దీపనల్లో మోదీ సర్కారు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తున్నది. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది దేశ జీడీపీలో దాదాపు 10 శాతంతో సమానం. ఈ మెగా ఉద్దీపనలో తొలి విడుత సాయం వివరాలను బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇక్కడ విడుదల చేశారు. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులు ఎంఎస్‌ఎంఈల ఊపిరిని తోడేస్తున్నాయి. సంస్థల నిర్వహణే కష్టంగా మారింది. 

ఈ నేపథ్యంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 లక్షల కోట్ల రుణాలను నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రుణదాతలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుందన్నారు. దీనివల్ల 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాగా, 4 ఏండ్ల కాలపరిమితితో ఉండే ఈ రుణాలపై ఏడాది మారటోరియం కూడా వర్తిస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అలాగే రుణ ఎగవేతల జాబితాలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకూ రూ.20 వేల కోట్ల సహాయక రుణాలను మంత్రి ప్రకటించారు. దీనివల్ల 2 లక్షల ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరనున్నది. ఎంఎస్‌ఎంఈల వృద్ధి కోసం రూ.50 వేల కోట్లతో ఓ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్టాక్‌మార్కెట్లలోకి ప్రవేశించాలనుకునే సంస్థలకు ఈ నిధి తోడుగా ఉంటుందని, రూ.10 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఇందులో ఉంటుందన్నారు. ఇక ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం 200 కోట్ల లోపు గ్లోబల్‌ టెండర్లను అనుమతించబో మని మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఎన్‌బీఎఫ్‌సీల కోసం..

ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐల కోసం మెగా ప్యాకేజీలో రూ.30 వేల కోట్లను నిర్మలా సీతారామన్‌ కేటాయించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థలకు బ్యాంకర్ల నుంచి మరింత దన్ను లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్‌లోనూ కొత్త విశ్వాసం నిండగలదన్న ధీమాను కనబరిచారు. తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌తో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల కోసం కూడా మరో రూ.45 వేల కోట్ల పాక్షిక రుణ పూచీకత్తు పథకం 2.0ను ఆవిష్కరించారు. దీనివల్ల వ్యక్తిగత, ఎంఎస్‌ఎంఈల రుణాలకు బలం చేకూరగలదు.

ఇకపై ఎంఎస్‌ఎంఈ అంటే?..

ఎంఎస్‌ఎంఈల నిర్వచనాన్ని కేంద్ర ప్రభు త్వం మార్చింది. మరిన్ని ప్రయోజనాలు అందేలా విస్తరించింది. అంతేగాక తయారీ, సేవా రంగాల్లోని ఎంఎస్‌ఎంఈల మధ్యగల వ్యత్యాసాలనూ తొలగించింది.సూక్ష్మ సంస్థలు: కోటి రూపాయల వరకు పెట్టుబడులతో ఏర్పాటై.. రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ను కలిగి ఉన్నవి.చిన్న సంస్థలు: రూ.10 కోట్లదాకా పెట్టుబడులతో మొదలై.. రూ.50 కోట్ల వరకు టర్నోవర్‌తో ఉన్నవి.మధ్యతరహా సంస్థలు: రూ.20 కోట్ల మేర పెట్టుబడులతో స్థాపించి.. రూ. 100 కోట్ల వరకు టర్నోవర్‌ను కలిగున్నవి.

రియల్టర్లకు ఊరట

 • ప్రాజెక్టుల గడువు ఆరు నెలలు పొడిగింపు
 • అవసరమైతే మరో మూడు నెలలు అదనం 
 • ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటన

కొవిడ్‌-19 సంక్షోభంతో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టుల పూర్తికి నిర్దేశించిన గడువును ఆరునెలలు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌) కింద నమోదై మార్చి 25 లేదా ఆ తర్వాత గడువు పూర్తయ్యే ప్రాజెక్టులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే ఈ గడువును రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీలు మరో మూడు నెలలు పొడిగించవచ్చని స్పష్టం చేశారు. కోవిడ్‌-19 కారణంగా నమోదు చేసుకోలేని ప్రాజెక్టులకు వ్యక్తిగతంగా ఎలాంటి దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఈ నిర్ణయం వల్ల రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారని వివరించారు. కరోనా కాటుతో నిర్మాణ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెరా కింద కొవిడ్‌-19 సంక్షోభాన్ని ‘ఫోర్స్‌ మెజ్యూర్‌'గా పరిగణిస్తున్నామని, దీనిపై రాష్ర్టాలతోపాటు వాటి రెగ్యులేటరీ అథారిటీలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖలు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. 

నూతనోత్తేజం


‘ఈ ఆర్థిక ప్యాకేజీ పారిశ్రామికవేత్తల్లో కొత్త శక్తిని నింపి, పోటీతత్వాన్ని పెంచుతుంది. వ్యాపా రాలకు ఊతమిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను తీర్చడానికి ఈ ఉద్దీపనల ప్రయాణం సుదీర్ఘంగా కొనసాగుతుంది’.
- ప్రధాని నరేంద్ర మోదీ 
డిస్కంలకు రూ.90 వేల కోట్లు


నిధుల కొరతను ఎదుర్కొంటున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.90 వేల కోట్ల నగదు సాయాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా మెగా ప్యాకేజీలో డిస్కంలకు కేంద్రం సాయం అందించింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) లేదా రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ఈ రూ.90 వేల కోట్లను రుణాల రూపంలో డిస్కంలకు అందివ్వనున్నాయి. ఇందులో చాలావరకు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల బకాయిల చెల్లింపునకు డిస్కంలు వినియోగించనున్నాయి. 

 • ఎంఎస్‌ఎంఈలకు పూచీకత్తు అవసరంలేకుండా రుణాలు రూ.3లక్షల కోట్లు
 • ఎంఎస్‌ఎంఈలకు అదనపు రుణ సౌకర్యం రూ.20,000 కోట్లు
 • ఎంఎస్‌ఎంఈల్లోకి ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ద్వారా రూ.50,000 కోట్లు 
 • రూ.200 కోట్ల లోపు అంతర్జాతీయ టెండర్లకు అనుమతి రద్దు
 • మూడు నెలలపాటు  ఉద్యోగులు, సంస్థల ఈపీఎఫ్‌ వాటాను 12% నుంచి 10 శాతానికి తగ్గించడానికి..రూ.6,750 కోట్లు 
 • ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈలకు 3 నెలల చెల్లింపు  రూ.2,500 కోట్ల్లు 
 • నాన్‌బ్యాంకింగ్‌ సంస్థలకు రెండోవిడత పాక్షిక రుణ హామీ రూ.45,000 కోట్లు
 • నాన్‌బ్యాంకింగ్‌ సంస్థలు, మ్యూచువల్‌ఫండ్లు, హెచ్‌సీలకు ద్రవ్య సదుపాయం రూ.30,000 కోట్లు
 • టీడీఎస్‌, టీసీఎస్‌ 25% తగ్గింపు ద్వారా ప్రజల చేతుల్లో నగదు.. రూ.50,000 కోట్లు 
 • డిస్కంలలోకి  రూ.90,000 కోట్లు 
 • కాంట్రాక్టర్లకు ఉపశమన చర్యలు
 • రెరా పరిధిలోని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల పూర్తి, రిజిస్ట్రేషన్ల తేదీల పొడిగింపు
 • నాన్‌ కార్పొరేట్‌ వ్యాపారాలు, నిపుణులకు, చారిటబుల్‌ ట్రస్టులకు పెండింగ్‌ రిఫండ్లు తక్షణం చెల్లింపు
 • 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపన్ను రిటర్నుల దాఖలు తేదీ 2020 నవంబర్‌ 30వరకు పొడిగింపు


logo