ఆదివారం 31 మే 2020
Business - May 17, 2020 , 23:37:07

అంకెల గారడీ

అంకెల గారడీ

  • ప్రభుత్వ ప్యాకేజీ రూ.3.22 లక్షల కోట్లే ధ్వజమెత్తిన విపక్షాలు  
  • ధ్రువపరుస్తున్న ఆర్థిక గణాంకాలు
  • అసంతృప్తిలో వ్యాపార, పరిశ్రమ వర్గాలు

న్యూఢిల్లీ, మే 17: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ.. కేవలం అంకెల గారడీనే అని విపక్షాలు ధ్వజమెత్తాయి. రూ. 20 లక్షల కోట్లలో ప్రభుత్వం అందించిన ఉద్దీపన రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శించింది. మోదీ సర్కారు చెప్తున్నట్లుగా దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ దాదాపు 10 శాతం ఎంతమాత్రం కాదని, 1.6 శాతమేనని ఆదివారం ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, అధికారప్రతినిధి ఆనంద్‌ శర్మ మండిపడ్డారు. దేశ ప్రజలను మోసపూరిత, అసత్య, జిత్తులమారి ప్రకటనలతో కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టాలని చూస్తున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 ‘కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోడానికి, పేద ప్రజలు, చిన్న, మధ్యతరహా సంస్థల చేతుల్లోకి నగదును అందించేందుకు ప్రధాని మోదీ తప్పక మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందే’ అని శర్మ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్‌ చేశారు. మోదీ ఈ విషయంలో ఊరుకుంటే సరిపోదని, దీనిపై స్పందించాలన్నారు. ఈ క్రమంలోనే ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చకు సవాల్‌ విసిరారు. ఇక మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభుత్వ అదనపు ఆదాయం, ఖర్చుల కోసం ప్రకటించిందే తప్ప కరోనా బాధిత రంగాల కోసం కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కూడా ఇది పేద, రైతు, కార్మిక, వ్యాపార వ్యతిరేక ప్యాకేజీ అని దుయ్యబట్టారు. మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సైతం ట్విట్టర్‌ వేదికగా కొవిడ్‌-19 ప్యాకేజీపై నిప్పులు చెరిగారు.

బడ్జెట్‌పై ప్రభావం రూ.1.50 లక్షల కోట్లే

కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లుగా ఉన్నా.. బడ్జెట్‌పై ప్రభావం మాత్రం రూ.1.50 లక్షల కోట్లేనని బార్క్‌లేస్‌ దేశీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్‌ బజోరియా తెలిపారు. జీడీపీలో ఇది 0.5 శాతమేనని గుర్తుచేశారు. ఈ అంచనా కరోనా సాయం కంటే ద్రవ్యలోటు కట్టడికే మోదీ సర్కారు ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని ధ్రువపరుస్తుండటం గమనార్హం. మొత్తం ప్యాకేజీలో ఆర్బీఐ గతంలో ప్రకటించిన నిర్ణయాల విలువే రూ.8 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు మొత్తం ప్యాకేజీలో ఖజానాపై పడుతున్న భారం చాలా తక్కువేనని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ సలహాదారు డీకే శ్రీవాత్సవ అన్నారు. కాగా, ప్యాకేజీపై రిటైలర్ల సంఘం కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమను ఏమాత్రం ఆదుకోలేదని భారతీయ రిటైలర్ల సంఘం సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.


logo