ఆదివారం 29 నవంబర్ 2020
Business - Oct 31, 2020 , 01:53:09

విద్యుత్‌ వాహన వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహం

విద్యుత్‌ వాహన వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహం

  • రోడ్‌ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహన విధానాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా తొలి రెండు లక్షల విద్యుత్‌ ఆధారిత టూవీలర్‌ కొనుగోలుదారులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజుల నుంచి మినహాయింపును కల్పించింది. దీంతో ఒక్కో కొనుగోలుదారునికి రూ.6,330 నుంచి 10,110 వరకు లబ్ధి చేకూరుతుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.300లు ఉండగా, రోడ్‌ ట్యాక్స్‌ వాహన ధరలనుబట్టి రూ.6,030 నుంచి 9,810 వరకు ఉన్నది. త్రీ వీలర్లు, మోటర్‌ క్యాబ్‌లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ప్రైవేటు కార్లు, బస్సులు, ట్రాక్టర్లకూ ప్రోత్సాహకాలు ఉన్నాయి. అయితే ఈ వాహనాలు రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్‌ కావాల్సి ఉంటుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ వాహన ధరలను ఒక్కసారి పరిశీలిస్తే..

అథర్‌: ఈ సంస్థ రెండు రకాల ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయిస్తున్నది. అథర్‌ 450 ఎక్స్‌షోరూం (ఢిల్లీ) ధర రూ.1.13 లక్షలు. వేరియంట్‌ను బట్టి 50ఎక్స్‌ మోడల్‌ ధర (హైదరాబాద్‌) రూ.1.42-1.61 లక్షలుగా ఉన్నది.

టీవీఎస్‌ మోటర్‌: టీవీఎస్‌ మోటర్‌ ఇటీవలే ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.09 లక్షలు.  గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. త్వరలో క్రెయాన్‌ మోడల్‌నూ తీసుకురానుండగా, దీని ధర రూ.70వేలు ఉంటుందని అంచనా.

హీరో ఎలక్ట్రిక్‌: హీరో ఎలక్ట్రిక్‌ ఫ్లాష్‌, ఆప్టిమా, ఎన్‌వైఎక్స్‌, డాష్‌, ఫోటాన్‌ మోడళ్లను విక్రయిస్తున్నది. వీటి ఎక్స్‌షోరూం (ఢిల్లీ) ధరల శ్రేణి రూ.41వేల నుంచి 80 వేల వరకు ఉన్నది.

రివోల్ట్‌: రివోల్ట్‌ ఆర్‌వీ400 మోటర్‌సైకిల్‌. దేశంలోనే తొలి కృత్రమ మేధస్సు (ఏఐ) ఆధారిత బైక్‌. గంటకు 85 కిలోమీటర్ల వేగం దీని సొంతం. దీని ఎక్స్‌షోరూం (ఢిల్లీ) ధర రూ.98,999-1.03 లక్షలు.

బజాజ్‌ ఎలక్ట్రిక్‌: ఒకప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన చేతక్‌ పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను బజాజ్‌ అందుబాటులోకి తెచ్చింది. దీని ఎక్స్‌షోరూం (హైదరాబాద్‌) ధర రూ.1.15 లక్షలు.

ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ: ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర రూ. 20.88 లక్షల నుంచి రూ. 23.58 లక్షల మధ్య ఉన్నది. ఒక్క చార్జింగ్‌పై 340 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ వాహన పాలసీతో వీటి వాడకం మరింత పెరుగనున్నది.  చిన్న స్థాయి సంస్థ లను దృష్టి లో పెట్టుకొని చర్యలు తీసుకుంటే మరింత బాగుండేది. అయినప్పటికీ ఈ పాలసీ మొత్తం కొనుగోలుదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్గించేలా ఉన్నది. 

 - చందు కుమార్‌  వర్సటైల్‌ ఆటో  కంపొనెంట్‌ సీఎండీ