ఆదివారం 24 మే 2020
Business - Feb 26, 2020 , 00:02:12

ఎయిర్‌ ఇండియా రేసులో అదానీ!

ఎయిర్‌ ఇండియా రేసులో అదానీ!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: రుణసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేయడానికి దేశీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ కూడా బిడ్డింగ్‌ దాఖలు చేయను న్నారు. తీవ్ర నష్టాల్లో నడుస్తున్న ఈ సంస్థను పూర్తిగా వదిలించుకోవడానికి 100 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఇదివరకే కేంద్రం ప్రకటించింది.  అదానీతోపాటు టాటా గ్రూపు, హిందుజాలు, ఇండిగో, న్యూ యార్క్‌నకు చెందిన ఫండ్‌ ఇంటరప్స్‌ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయానికి గడువు వచ్చే నెల వరకు కేంద్రం పొడిగించింది. 


ఈ బిడ్డింగ్‌ దాఖలుపై అదానీ గ్రూపు ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సంస్థ..ఎయిర్‌ ఇండియాతోపాటు విమానాశ్రయాల నిర్వహణపై కూడా దృష్టి సారించినట్లు తెలిసింది. గతేడాది  అహ్మదాబాద్‌, లఖ్నో, జైపూర్‌, గువాహాటీ, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాల ఆధునీకరణకు సంబంధించి నిర్వహించిన బిడ్డింగ్‌లో సంస్థ తక్కువ కోడ్‌ చేసి వీటిని దక్కించుకున్నది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకు రూ.60 వేల కోట్ల అప్పు ఉండగా, గడిచిన మూడేండ్లుగా నష్టాలతో కాలంవెళ్లదీస్తున్నది. వాటాల విక్రయానికి సంబంధించి వరుసగా రెండేండ్లుగా నిర్వహించిన బిడ్డింగ్‌లో ఒక్కసంస్థ కూడా బిడ్లు దాఖలు చేయలేదు.


మరోసారి గడువు పెంపు!

ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయానికి సంబంధించి గతంలో ఇచ్చిన గడువును వచ్చే నెల 17 వరకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో వివిధ శాఖల మంత్రులతో ఏర్పాటైన కమిటీ ఈ వారం చివర్లో ఇందుకు సంబంధించి నిర్ణ యం తీసుకోనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదివరకే గడువును మార్చి 6 నుంచి 11 వరకు పెంచిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు నిర్మ లా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌ సింగ్‌ పూరి ఉన్నారు.


logo