బుధవారం 03 జూన్ 2020
Business - May 17, 2020 , 23:37:08

సర్కారీ సంస్థలు మాయం

సర్కారీ సంస్థలు మాయం

  • ప్రైవేటు చేతికి వ్యూహాత్మకేతర రంగాల్లోని ప్రభుత్వ సంస్థలు  
  • వ్యూహాత్మక రంగాల్లోనూ నాలుగుకు మించి ఉండవు
  • ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  
  • అన్ని రంగాల్లోకి ఇక ప్రైవేటు సంస్థల రాక

న్యూఢిల్లీ, మే 17: బొగ్గు గనుల్లో ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యాన్ని తగ్గించిన మోదీ సర్కారు.. వ్యూహాత్మకేతర రంగాల్లోని ప్రభుత్వ కంపెనీలనూ ప్రైవేటీకరించనున్నది. కొవిడ్‌-19 రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఆదివారం ఇక్కడ ఆఖరి, ఐదో విడుత ప్రకటనల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. సర్కారీ ఆధీనంలోని కంపెనీల కోసం కొత్త ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌ఈ) విధానాన్ని తెస్తున్నామని, దీనికింద వ్యూహాత్మకేతర రంగాల్లోగల ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరిస్తామని విలేకరులకు తెలిపారు. వ్యూహాత్మక రంగాల్లోనూ 4 సంస్థల కంటే ఎక్కువ ప్రభుత్వానికి చెందినవి ఉండబోవని స్పష్టం చేశారు. మిగిలినవన్నీ ప్రైవేట్‌ యాజమాన్యం చేతుల్లోకే వెళ్తాయన్నారు. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)లను సంస్కరించడంలో భాగంగా వ్యూహాత్మక రంగాలను గుర్తిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వాటి వివరాలను ప్రకటిస్తామన్న ఆమె.. కనిష్ఠంగా ఒక్కటి, గరిష్ఠంగా నాలుగు సంస్థలే ఈ రంగాల్లో ఉంటాయన్నారు. ఇక వ్యూహాత్మకం కాని రంగాల్లో అన్ని సంస్థల్నీ ప్రైవేట్‌ వ్యక్తులపరం చేస్తామని వెల్లడించారు. ‘కొత్త పీఎస్‌ఈ విధానాన్ని మేము ప్రకటించబోతున్నాం. ఇకపై అన్ని రంగాల్లోకి ప్రైవేట్‌ సంస్థలూ రావచ్చు. అయినప్పటికీ ప్రాధాన్య రంగాల్లో ప్రభుత్వ సంస్థల పాత్ర కీలకంగానే ఉంటుంది’ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2.10 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.1.20 లక్షల కోట్లను అందుకోవాలని నిర్దేశించుకున్నది.

దివాలా చట్టం చెల్లదు

  • ఏడాదిదాకా వెసులుబాటు
  • కార్పొరేట్‌ సంస్థలకు గొప్ప ఊరట

కార్పొరేట్‌ సంస్థలకు కేంద్రం గొప్ప ఊరటనిచ్చింది. దివాలా చట్టం అమలును ఏడాదిపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని సంస్థలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వ్యాపారం స్తంభించి తీసుకున్న రుణాలను చెల్లించలేని పరిస్థితిలో పడ్డాయి. ఈ క్రమంలో ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ప్స్రీ కోడ్‌ (ఐబీసీ) కింద ఎలాంటి చర్యలు సంవత్సరం పాటు ఉండబోవని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో సంస్థలు పొందే రుణాలు డిఫాల్ట్‌ కిందకు రావని, దివాలా చట్టం నుంచి ఈ రుణాలకు మినహాయింపు ఉంటుందని కూడా చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేకూరేలా దివాలా ప్రక్రియ మొదలు కావడానికి ఉన్న కనీస డిఫాల్ట్‌ మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి కోటి రూపాయలకు పెంచుతున్నామన్నారు. ఈ మేరకు దివాలా చట్టంలో ఆర్డినెన్స్‌ ద్వారా మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. 

కంపెనీల చట్టంలో మార్పులు

కంపెనీల చట్టం కింద గతంలో పేర్కొన్న ఏడు నేరాలను తొలగిస్తున్నామని, ఐదింటిని ప్రత్యామ్నాయ విధానంలోకి మారుస్తున్నామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ మార్పులకు సంబంధించి ఆర్డినెన్స్‌ను తెస్తామన్నారు.

నేరుగా విదేశీ సెక్యూరిటీల్లోకి..

దేశీయ కార్పొరేట్లు నేరుగా విదేశీ సెక్యూరిటీల్లో లిస్టింగ్‌ అయ్యేందుకు సర్కారు అనుమతినిచ్చింది. అయితే స్టాక్‌ ఎక్సేంజీలపై నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లలో నమోదైన ప్రైవేట్‌ కంపెనీలను మాత్రం లిస్టెడ్‌ కంపెనీలుగా పరిగణించబోమన్నది.


logo