మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jun 29, 2020 , 18:25:38

ఈ రిస్ట్‌ బ్యాండ్‌ శరీర ఉష్ణోగ్రతను చెప్పేస్తుంది..!

ఈ రిస్ట్‌ బ్యాండ్‌ శరీర ఉష్ణోగ్రతను చెప్పేస్తుంది..!

ముంబై: కొవిడ్‌-19 నేపథ్యంలో ఎక్కడికెళ్లినా మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకొని లోనికి అనుమతిస్తున్నారు. ఇందుకోసం పరారుణ థర్మామీటర్లను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఎప్పటికప్పుడు తమ బాడీ టెంపరేచర్‌ను తెలుసుకొని ప్రతిఒక్కరూ అలర్ట్‌గా ఉండేలా జీఓక్యూఐఐ అనే కంపెనీ సెన్సార్‌ ఆధారిత రిస్ట్‌ బ్యాండ్‌ను రూపొందించింది. ప్రపంచంలోనే బాడీ టెంపరేచర్‌ను‌ కొలిచే మొదటి రిస్ట్‌ బ్యాండ్‌గా భావిస్తున్న వైటల్‌ 3.0ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అలాగే, ఇది శరీర ఉష్ణోగ్రతతోపాటు హార్ట్‌ రేట్‌, బ్లడ్‌ ప్రెషర్‌, స్టెప్‌ కౌంట్‌, కెలోరీస్‌ని కూడా ట్రాక్‌ చేస్తుంది. 

వైటల్‌ 3.0లో ఇన్‌బిల్ట్‌ టెంపరేచర్‌ డిస్‌ప్లేతోపాటు థర్మల్‌ సెన్సార్లను వాడారు. ఇందులో రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. టెంపరేచర్‌ను నిరంతరం పర్యవేక్షించుకోవచ్చు. లేదా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకునేలా దీన్ని సెట్‌ చేసుకోవచ్చు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, దవాఖానలు, పాఠశాలలు, బీపీవోలు, బీమా, బ్యాంకింగ్, రైడ్-షేరింగ్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు వైటల్ 3.0 ను ఉపయోగించేందుకు తమతో చర్చలు జరుపుతున్నాయని జీఓక్యూఐఐ వ్యవస్థాపకుడు, సీఈవో విశాల్ గొండాల్ పేర్కొన్నారు. వైటల్‌ 3.0 ధర రూ. 3,999 ఉంటుందని, ఇది భారతదేశంలో దశలవారీగా, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు తక్షణ ప్రాతిపదికన లభిస్తుందని తెలిపారు. అలాగే, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, యుఏఈ, సింగపూర్, ఇతర దేశాల్లోనూ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ రిస్ట్‌ బ్యాండ్ త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుందని వివరించారు.logo