ఆదివారం 17 జనవరి 2021
Business - Jan 14, 2021 , 23:04:10

పాల‌సీ ఉల్లంఘించిన రుణ యాప్‌ల తొల‌గింపు

పాల‌సీ ఉల్లంఘించిన రుణ యాప్‌ల తొల‌గింపు

న్యూఢిల్లీ: భార‌త్‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను, త‌న యూజ‌ర్ సేఫ్టీ పాల‌సీల‌ను ఉల్లంఘించిన ఆన్‌లైన్ రుణ యాప్‌ల‌ను సెర్చింజ‌న్ గూగుల్ త‌న ప్లే స్టోర్ నుంచి గురువారం తొల‌గించి వేసింది. అలాగే, యాప్‌ల డెవ‌ల‌ప‌ర్లు సంబంధిత సంస్థ‌లు స్థానిక ప్ర‌భుత్వ‌

చ‌ట్టాల‌ను అనుస‌రిస్తున్నారా? లేదా? అన్న సంగ‌తిని నిర్ధారించుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. స్థానిక ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన యాప్‌ల‌ను తొల‌గించి వేస్తామ‌ని తెలిపింది. ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న ప‌లువురు వ్య‌క్తులు ఆన్‌లైన్‌లో యాప్‌లు ఇచ్చే రుణాలు తీసుకుని చెల్లించ‌లేక‌ ప్రాణాలు కోల్పోయిన, ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ సంగ‌తి తెలిసిందే. తాము ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌లు, యూజ‌ర్లు స‌బ్మిట్ చేసిన స‌మాచారం మేర‌కు భార‌త‌దేశంలో వంద‌ల కొద్దీ ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్‌ల ప‌రిస్థితిని స‌మీక్షించిన‌ట్లు సెర్చింజ‌న్ గూగుల్ పేర్కొంది. 

స‌ద‌రు యాప్‌లు త‌మ యూజ‌ర్ సేఫ్టీ పాల‌సీల‌ను ఉల్లంఘించిన‌ట్లు తేల‌గానే వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలిగించి వేసిన‌ట్లు గూగుల్ త‌న బ్లాగ్ పోస్ట్‌లో రాసుకుంది. దాదాపు 10 భారతీయ లోన్ యాప్ లపై గూగుల్ చర్యలు తీసుకుంది. వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా డిలీట్ చేసిన‌ట్లు గూగుల్ వెల్లడించింది. 

'వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా మేము భారత్ లో ఉన్న పలు రుణ యాప్ లపై మేము సమీక్ష జరిపాం. అవి వినియోగదారుల భద్రతా విధానాలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతున్నది. వాటిని వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించాం. మిగిలిన యాప్ లు స్థానిక చట్టాలకు లోబడి ఉన్నాయో.. లేవో తెలపాలని ఆయా యాప్ నిర్వాహకులను కోరాం..' అని గూగుల్ ప్రొడక్ట్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ సుజన్న ఫ్రే తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.