సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 23:47:15

రిలయన్స్‌తో గూగుల్‌ జోడీ?

రిలయన్స్‌తో గూగుల్‌ జోడీ?

  • జియోలో వాటా కొనుగోలుకు చర్చలు
  • 4 బిలియన్‌ డాలర్లు వెచ్చించనున్న ఐటీ దిగ్గజం
  • త్వరలో ప్రకటన వెలువడే అవకాశం

ముంబై, జూలై 17: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జియోతో చేతులు కలుపుతున్న సంస్థల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. గత కొన్ని నెలల్లో ఫేస్‌బుక్‌ సహా వివిధ సంస్థల నుంచి 15.64 బిలియన్‌ డాలర్ల (రూ.1.17 లక్షల కోట్ల) పెట్టుబడులను రాబట్టుకొన్న జియోతో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌ కూడా చేతులు కలపనున్నట్టు సమాచారం. గూగుల్‌ 4 బిలియన్‌ డాలర్లు (రూ.30,159 కోట్లు) వెచ్చించి జియోలో వాటా కొనుగోలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన చర్చలు పురోగమనంలో ఉన్నాయని, ఈ పెట్టుబడులకు సంబంధించి కొద్ది వారాల్లో ప్రకటన వెలువడే అవకాశమున్నదని ‘బ్లూమ్‌బర్గ్‌' వెల్లడించింది. అయితే దీనిపై అటు గూగుల్‌ గానీ, ఇటు రిలయన్స్‌ నుంచి గానీ స్పందించలేదు. 

ఈ డీల్‌ కుదిరితే ఇప్పటికే జియోలో పెట్టుబడులు పెట్టిన ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌, కేకేఆర్‌, ముబాదల, క్వాల్కమ్‌ లాంటి హై-ప్రొఫైల్‌ కంపెనీల సరసన గూగుల్‌ కూడా చేరుతుంది. భారత డిజిటల్‌ ఎకోసిస్టమ్‌లో తమ స్థానాన్ని పటిష్ఠపర్చుకొనేందుకు రానున్న 5-7 ఏండ్లలో 10 బిలియన్‌ డాలర్ల (రూ.75 వేల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్టు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు, భాగస్వామ్యాల్లో ఈక్విటీ పెట్టుబడులతోపాటు డాటా సెంటర్ల లాంటి వాటిలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెడతామని ఆయన వివరించారు. అయితే జియోలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్‌ ఆసక్తి చూపుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించలేదు.

ప్రపంచ కుబేరుల్లో అంబానీ @ 6


భారత్‌లో అత్యంత సంపన్నుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రపంచంలోని టాప్‌-10 కుబేరుల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకారు. గతవారం ఈ జాబితాలో ముకేశ్‌.. అమెరికా వ్యాపార దిగ్గజం, బెర్క్‌షైర్‌ హాత్‌వే గ్రూప్‌ సంస్థల అధినేత వారెన్‌ బఫెట్‌ను కిందికి నెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముకేశ్‌ సంపద 72.4 బిలియన్‌ డాలర్ల (రూ.5,46,062 కోట్ల)కు చేరిందని, దీంతో ఆయన సిలికాన్‌ వ్యాలీ టెక్‌ మొఘల్‌ ఎలాన్‌ మస్క్‌తోపాటు గూగుల్‌ సంస్థ సహ వ్యవస్థాపకులైన సెర్గీ బ్రిన్‌, లారీ పేజ్‌లను అధిగమించి ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఆరో స్థానానికి దూసుకెళ్లారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. సోమవారం స్టాక్‌ మార్కెట్లలో అమెరికా టెక్‌ షేర్ల విలువ పతనమవడంతో లారీ పేజ్‌ సంపద 71.6 బిలియన్‌ డాలర్లకు, సెర్గీ బ్రిన్‌ సంపద 69.4 బిలియన్‌ డాలర్లకు, టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ సంపద 68.6 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్టు బ్లూమ్‌బర్గ్‌ వివరించింది.


logo