బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 14, 2020 , 12:00:51

దిగొస్తున్న బంగారం

దిగొస్తున్న బంగారం
  • రూ. 1,100 తగ్గిన తులం ధర
  • రూ. 1,500 చవకైన వెండి

న్యూఢిల్లీ, మార్చి 13: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి వెనక్కితీసుకోవడం, రూపాయి విలువ కోలుకోవడంతో ధరలు పతనమయ్యాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర శుక్రవారం ఒకేరోజు రూ.1,097 తగ్గి రూ.42,600 స్థాయికి పడిపోయింది. గురువారం ఈ ధర రూ.43,697గా ఉన్నది. వెండి కూడా భారీగా పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.1,574 దిగొచ్చి రూ.44,130 వద్ద ముగిసింది. గత ముగింపు రూ.45,704గా ఉన్నది.  హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.43,300గాను, వెండి రూ.43,931కి పడిపోయింది. స్టాక్‌ మార్కెట్లు, రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్‌ రంగంలోకి దిగడంతో తిరిగి కోలుకోవడం బులియన్‌ ధరలు దిగిరావడానికి ఇదే ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,585 డాలర్లకు, వెండి 15.65 డాలర్లకు పడిపోవడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. 


రెండు రోజుల్లో రూ.2 వేలు

ఈ నెల మొదట్లో గరిష్ఠ స్థాయి రూ.45 వేల మార్క్‌ను దాటిన బంగారం ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. కరోనా వైరస్‌ కల్లోలం దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు, మరోవైపు రూపాయి బక్కచిక్కుతున్న ప్రస్తుత సమయంలో పసిడి ధరలు కూడా తగ్గుముఖం పట్టడం విశేషం. గడిచిన రెండు రోజుల్లోనే  బంగారం ధర ఏకంగా రూ.2 వేలకు పైగా పడిపోయింది. వెండి కూడా రూ.2,600కి పైగా జారుకున్నది.  ఈక్విటీల కంటే బంగారం సురక్షితమైన భావించిన పెట్టుబడిదారులు వీటిపై కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రోజు రోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో గ్లోబల్‌ మార్కెట్లో 2011 తర్వాత ఒక్క వారంలో ఇంతటి భారీ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. మొత్తంమీద ఈవారంలో స్పాట్‌ గోల్డ్‌ 1.3 శాతం తగ్గి 1,555.42 డాలర్లకు, గత సెషన్‌లోనూ 3.6 శాతం తగ్గింది. సోమవారం ఏడేండ్ల గరిష్ఠ స్థాయి 1,700 డాలర్లు పలికిన ధర ప్రస్తుతం 7 శాతం తగ్గింది. 


logo