బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Dec 27, 2020 , 21:13:23

సామాన్యులు బంగారం కొనగలరా?!

సామాన్యులు బంగారం కొనగలరా?!

ముంబై: అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌.. అటుపై ఆర్థిక మాంద్యం.. పులిమీద పుట్రలా దూసుకొచ్చిన కరోనా మహమ్మారి.. ఫలితంగా అనిశ్చిత వాతావరణం.. పెట్టుబడులకు స్వర్గధామ మార్గాలపై ఇన్వెస్టర్ల వెతుకులాట.. అనిశ్చిత సమయంలో పెట్టుబడులకు స్వర్గధామం పుత్తడే. తాజాగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ స్టిమ్యులేషన్‌ ప్యాకేజీలను అమలు చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో వచ్చే ఏడాది తులం బంగారం రూ.60 వేలకు దూసుకెళుతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రస్తుతం 2020లో కరోనా మహమ్మారితో తలెత్తిన సామాజిక, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం సేఫ్‌ హెవెన్‌గా నిలిచింది. గత ఆగస్టులో పది గ్రామలు బంగారం ధర రూ.56,191లకు చేరి ఆల్‌ టైం రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 2075 డాలర్లకు చేరుకున్నది.ఇదిలా ఉంటే, 2020లో పుత్తడిపై పెట్టుబడులు 2011 తర్వాత మెరుగైన లాభాలు తెచ్చి పెట్టాయి.

2019 మధ్య నుంచే పలు దేశాల ప్రభుత్వాలు వ్యవస్థలోకి ద్రవ్య లభ్యత కోసం తమ ద్రవ్య పరపతి విధానాల్లో వడ్డీరేట్లు తగ్గించి వేశాయి. ఫలితంగా పలు దేశాలలో ఇన్వెస్టర్లకు అత్యంత ఆకర్షణీయ మార్గంగా పుత్తడి నిలిచింది. ‘ఈ ఏడాది ప్రారంభంలో పది గ్రాముల బంగారం ధర రూ.39,100 పలికితే, ఔన్స్‌ ధర 1,517 డాలర్లకు చేరుకున్నది. ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశాలను చుట్టేయడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.38,400 నుంచి క్రమంగా పెరుగుతూ రూ.56,191ల ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పిందని కామ్‌ట్రెండ్జ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ సీఈవో గణశేఖర్ త్యాగరాజన్ వ్యాఖ్యానించారు.  

కరోనా నియంత్రణకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం తాజాగా స్టిమ్యులేషన్ ప్యాకేజీ అమలు అంచనా నేపథ్యంలో పసిడి శక్తిమంతమైన పెట్టుబడి మార్గంగా నిలుస్తుందని ఆయన అంటున్నారు. మరోవైపు త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బిడెన్‌ సంస్కరణలు అమలు చేస్తే బులియన్‌ ముందుకు దూసుకెళుతుందని త్యాగరాజన్‌ అన్నారు. 

హెచ్డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమొడిటీస్‌) తపన్‌ పటేల్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఔన్స్‌ పసిడి అంతర్జాతీయ మార్కెట్‌లో 2150-2330 డాలర్లు పలుకుతుందన్నారు. దేశీయంగా రూ.63వేలకు చేరుతుందని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo