బుధవారం 27 మే 2020
Business - May 16, 2020 , 23:47:43

పసిడి పరుగో పరుగు

పసిడి పరుగో పరుగు

  • చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. తులం విలువ రూ.47వేలపైనే
  • సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిక.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం

తాయారమ్మకు ఓ కూతురు. బిడ్డ పెండ్లి కోసం బంగారాన్ని ముందే కొనిపెట్టాలనుకున్నది. నగల దుకాణానికి వెళ్తే తులం రూ.25 వేలు అన్నారు. రెండేండ్ల తర్వాత వెళ్తే రూ.30 వేలకు చేరింది. 

ఏడాది తర్వాత కొందాంలే అనుకుంటే అప్పుడు తులం రూ.35 వేలను తాకింది. ప్రస్తుతం కూతురు వయసు 22 ఏండ్లు. బంగారం విలువ రూ.47 వేలను దాటింది. 

ఈ పరిస్థితి ఒక్క తాయారమ్మదే కాదు.. సగటు భారతీయులందరిదీ. అసలు పసిడి ధర ఎందుకు పెరుగుతున్నది.

న్యూఢిల్లీ, మే 16: బంగారం.. ఒకప్పుడు కేవలం ఓ నగ మాత్రమే. కానీ ఇప్పుడు అంతకుమించి అర్థాలెన్నో. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని, గతి చక్రాన్ని మార్చగల శక్తి పసిడికి ఉందంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అందుకే పుత్తడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. సాధారణ ఇంట్లో పెట్టుపోతలుగా ఉన్న బంగారం.. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా అవతరించింది. మార్కెట్‌లో రోజుకో ధరతో కనిపిస్తున్న పసిడి విలువ.. గడిచిన పదేండ్లలో దాదాపు మూడింతలు పెరుగడం గమనార్హం. ప్రస్తుతం 22 క్యారెట్‌ తులం ధర దేశీయ మార్కెట్‌లో రూ.46,100లుగా ఉంటే.. 24 క్యారెట్‌ రూ.47,100 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు ధర ఏడాది కాలంలో 1,250 డాలర్ల నుంచి దాదాపు 1,700 డాలర్లకు ఎగిసింది.  

ధరల పెరుగుదలకు కారణం?

దేశీయంగా బంగారం ధర పెరుగడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణం. ముఖ్యంగా గతేడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తుందన్న సంకేతాలు వచ్చిన దగ్గర్నుంచి పుత్తడి ధరల్లో స్థిరత్వం లోపించింది. స్టాక్‌ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నకొద్దీ మదుపరులు బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడిగా చూడటం మొదలు పెట్టారు. దీనివల్ల డిమాండ్‌ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు బంగారం నిల్వల్ని పెంచుకోవడం కూడా బహిరంగ మార్కెట్‌లో ధరల్ని పరుగులు పెట్టిస్తున్నది. 

వచ్చే ఏడాది రూ.82 వేలకు ధర

బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఇదే దూకుడుతో వచ్చే ఏడాది తులం ధర రూ.82 వేలకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2021 ఆఖరుకల్లా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు ధర 3 వేల డాలర్లు పలుకవచ్చని, భారతీయ మార్కెట్‌లో 10 గ్రాములు రూ.82 వేలకు పెరుగవచ్చని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందా?

కరోనా నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ప్రజల ఆదాయాలూ భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో బంగారం లాంటి ఖరీదైన మార్కెట్ల పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మునుపటి స్థాయిలో కొనుగోళ్లు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. 

  • దేశీయ మార్కెట్‌లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 10 శాతం పెరిగిన బంగారం ధర
  • ఆర్బీఐ వద్ద 653.01 మెట్రిక్‌ టన్నుల పసిడి నిల్వలు
  • భారతీయుల వద్ద 25 వేల మెట్రిక్‌ టన్నుల బంగారం ఉంటుందని అంచనా
  • నిరుడు దేశీయ మార్కెట్‌లో పుత్తడి డిమాండ్‌ 690.4 మెట్రిక్‌ టన్నులు
  • 2019లో ప్రపంచవ్యాప్తంగా 3,300 మెట్రిక్‌ టన్నుల పుత్తడి ఉత్పత్తి


logo