బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jun 26, 2020 , 00:26:58

68 వేలకు పసిడి

 68 వేలకు పసిడి

  • వచ్చే రెండేండ్లలో చేరుకోవచ్చంటున్న విశ్లేషకులు

న్యూఢిల్లీ, జూన్‌ 25: ఆర్థిక రేటింగ్‌ సంస్థల ప్రతికూల రేటింగ్‌లు, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాల ఫలితంగా  బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోవచ్చన్న అభిప్రా యాలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిన్నర నుంచి రెండేండ్లకాలంలో బంగారం ధర రూ.68 వేలు పలుకవచ్చునని బులియన్‌ పండితులు అంచనావేస్తున్నారు. అయితే డాలర్‌ మారకంలో రూపాయి కదలికపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తున్నప్పటికీ  బంగారం ధరలు మాత్రం కిందికి దిగిరావడం లేదు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 5 వేలకు పైగా ఎగబాకింది. 

వచ్చే కొన్ని నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ కమోడిటీ విభాగ అధిపతి కిశోర్‌ నార్నే అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదిన్నర నుంచి రెండేండ్లకాలంలో ఈ ధర రూ.65 వేల నుంచి రూ.68 వేల మధ్యకు చేరుకోవచ్చని ఆయన అంచనావేస్తున్నారు.  కరోనాతో కాటుతో         కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చని, దీంతో వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు మరో రెండేండ్లపాటు సులభమైన పాలసీ విధానానికి కట్టుబడే అవకాశం ఉన్నదని చెప్పారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటం కూడా పసిడి ధరలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయన్నారు. 

300 తగ్గిన పసిడి ధర

క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో పదిగ్రాముల పసిడి ధర రూ.293 తగ్గి రూ.49,072కి పరిమితమైంది. బుధవారం ఇది రూ.49,365గా ఉన్నది. పసిడితోపాటు వెండి భారీగా పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ.598 తగ్గి రూ. 48,705 కు చేరింది.


logo