సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 25, 2020 , 00:02:35

పసిడి 44,472

పసిడి  44,472
  • ఒకేరోజు రూ.953 పెరిగిన తులం ధర
  • ఆరు రోజుల్లో రూ.2 వేలకు పైగా..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడంతో పసిడి ధర రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.943 పెరిగి రూ.44,472 పలికింది. పసిడితోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది. గడిచిన ఆరు రోజుల్లో పసిడి రూ.2 వేలకు పైగా పెరిగి సామాన్యుడికి అందనంటున్నది. మరోవైపు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.586 అధికమై రూ.50 వేలకు చేరువైంది.


గత శనివారం రూ.49,404గా ఉన్న వెండి ధర ప్రస్తుతం రూ.49,990 వద్ద ముగిసింది. కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు పాకుతుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు తపన్‌ పటేల్‌ తెలిపారు. న్యూయార్క్‌  మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,680 డాలర్లకు చేరుకోగా, వెండి 18.80 డాలర్లు పలికింది. వారం క్రితం ఇది 1,606.60 డాలర్లుగాను, 18.32 డాలర్లుగా ఉన్నాయి. మరోవైపు రూపాయి విలువ నష్టపోవడం కూడా ధరలు పెరుగడానికి మరో కారణమన్నారు.


logo