సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Jan 31, 2020 , 01:42:08

వన్నె తగ్గిన బంగారం

వన్నె తగ్గిన బంగారం

న్యూఢిల్లీ, జనవరి 30: రికార్డు స్థాయిలో పలికిన ధరలు బంగారం డిమాండ్‌ను తగ్గించేశాయి. గతేడాది భారత్‌లో పసిడికి ఆదరణ 9 శాతం పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం తెలిపింది. 2019లో 690.4 టన్నులుగా నమోదైందని వివరించింది. 2018లో 760.4 టన్నులుగా ఉన్నట్లు పేర్కొన్నది. విలువ ఆధారంగా మాత్రం 2019లో రూ.2,17,770 కోట్లుగా ఉంటే, 2018లో రూ.2,11,860 కోట్లుగా ఉన్నట్లు తేలింది. దేశీయ మార్కెట్‌లో పెరుగుతూపోయిన ధరలు, ఆర్థిక మందగమనం ఛాయలు.. రిటైల్‌ అమ్మకాలకు విఘాతం కలిగించాయని డబ్ల్యూజీసీ ఇండియా కార్యకలాపాల ఎండీ సోమసుందరం పీటీఐతో అన్నారు. నిరుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39 వేలపైకి చేరింది. 2018తో పోల్చితే ఇది 24 శాతం అధికం కావడం గమనార్హం. దీంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడగా, అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరుగలేదు. ఇదిలావుంటే ఈ ఏడాది దేశీయ పుత్తడి డిమాండ్‌ 700-800 టన్నులకు పెరిగేందుకు అవకాశాలున్నాయని సోమసుందరం అంచనా వేశారు. ధర ఎక్కువగా ఉన్నా.. కొనేందుకు కస్టమర్లు ముందుకు రావచ్చని, వినియోగదారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆర్థిక సంస్కరణలకు వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా బంగారానికి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. 

14 శాతం క్షీణించిన దిగుమతులు

2019లో దేశంలోకి 646.8 టన్నుల పసిడి వచ్చిందని, 2018లో ఇది 755.7 టన్నులుగా ఉందని ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ తమ తాజా నివేదికలో తెలియజేసింది. దీంతో 14 శాతం క్షీణించినైట్లెంది. ఇక అనధికారిక మార్కెట్‌ ద్వారా దిగుమతులు గతేడాది 115-120 టన్నులుగా ఉండొచ్చని సోమసుందరం తెలిపారు. కాగా, గతేడాది ఆభరణాల డిమాండ్‌ గతంతో పోల్చితే 9 శాతం పడిపోయి 598 టన్నుల నుంచి 544.6 టన్నులకు దిగజారగా, కడ్డీలు, నాణేల డిమాండ్‌ 10 శాతం క్షీణించి 162.4 టన్నుల నుంచి 145.8 టన్నులకు పరిమితమైంది. నిరుడు ధనత్రయోదశి సైతం మార్కెట్‌లో జోష్‌ను నింపలేకపోయిందని సోమసుందరం అన్నారు.

రూ.400 పెరిగిన బంగారం

పెండ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గురువారం న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.400 ఎగబాకి రూ.41,524కు చేరింది. బుధవారం ఇది రూ.41,124గా ఉన్నది. కిలో వెండి ధర కూడా రూ.737 ఎగిసి రూ.47,392 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ధరలు పుంజుకున్నట్లు బులియన్‌ ట్రేడర్లు తెలిపారు.


logo