సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 04, 2020 , 23:46:36

బంగారం భగ..భగ

బంగారం భగ..భగ
  • ఒకేరోజు రూ.1,150 పెరిగిన తులం ధర
  • రూ.1,200 అధికమైన కిలో వెండి

న్యూఢిల్లీ, మార్చి 4: బంగారం ధరలు మళ్లీ మండుతున్నాయి. గడిచిన వారం రోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన అతి విలువైన లోహాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఊపందుకోవడం, రూపాయి క్షీణించడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర బుధవారం ఒకేరోజు 1,155 పెరిగి రూ.44,383కి చేరుకున్నది. మంగళవారం ఈ ధర రూ.43,228గా ఉన్నది. పసిడితోపాటు వెండి మరింత పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.1,200 పెరిగి రూ.47,730కి చేరుకున్నది. 


ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ 24 క్యారెట్ల ధర రూ.1,155 అధికమైందని, వరుసగా రూపాయి మరింత పతనమవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన ఆభరణాల వైపు మళ్లించడంతో ధరలు భారీగా పుంజుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,638 డాలర్లకు చేరుకోగా, వెండి 17.17 డాలర్లు పలికింది. కరోనా వైరస్‌ దెబ్బకు డీలా పడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను అరశాతం తగ్గించడంతో పసిడి ధరలు భారీగా పుంజుకున్నాయన్నారు. 


logo