శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 28, 2020 , 00:23:23

53వేలకు పసిడి

53వేలకు పసిడి

  • రూ.905 పెరిగిన తులం ధర

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 27:పసిడి ధరలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు చారిత్రక గరిష్ఠ స్థాయిలో దూసుకుపోతుండటంతోపాటు దేశీయంగా పెళ్ళిళ్ల సీజన్‌ కూడా తోడవడంతో గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్నది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.905 ఎగబాకి రూ.53 వేలకు చేరువై రూ.52,960 వద్ద ముగిసింది. గత సెషన్‌లో రూ.52,055 వద్ద ఉన్నది. బంగారంతోపాటు వెండి భారీగా పుంజుకుంటున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.3,347 ఎగబాకి రూ.65,670కి చేరుకున్నది. గతంలో రూ.62,323గా ఉన్నది. గడిచిన పది రోజుల్లో వెండి రూ.12 వేలకు పైగా పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.820 పెరిగి రూ.54,300 పలుకగా, 22 క్యారెట్ల ధర రూ.49,730కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,935 డాలర్లకు చేరుకోగా, వెండి 24 డాలర్లుగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ దీపక్‌ తెలిపారు. 

జూన్‌ 1 వరకు హాల్‌మార్క్‌ గడువు

ఆభరణాల వర్తకులకు కేంద్రం తీపి కబురును అందించింది. ఆభరణాలపై హాల్‌మార్క్‌ గడువును వచ్చే ఏడాది జూన్‌ 1 వరకు పెంచుతున్నట్లు కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ గడువు జనవరి 15 వరకు ఉండగా, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మరో నాలుగు నెలలు పెంచినట్లు అయింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌(బీఐఎస్‌) ప్రకారం హాల్‌మార్క్‌, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఏడాది క్రితమే ఆభరణాల వర్తకులను కేంద్రం ఆదేశించింది. logo