సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 02:41:14

పదేండ్ల గరిష్ఠానికి పసిడి ధర

పదేండ్ల గరిష్ఠానికి పసిడి ధర

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 8: పరుగు పందెంలో పసిడి దూసుకుపోతున్నది. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న బంగారం మరో మైలురాయికి చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్‌ నెలకొనడంతో దేశీయంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర మరో రూ.723 పెరిగి రూ.49,898 పలికింది. గ్లోబల్‌ రేట్లకు తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని బులియన్‌ వర్తకులు విశ్లేషిస్తున్నారు. గతవారం రోజులుగా భారీగా పెరిగిన వెండి స్వల్పంగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి రూ.100 తగ్గి రూ.50,416 వద్ద పరిమితమైంది. ఇతర నగరాల్లోనూ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర మరో రూ.370 పెరిగి ఏకంగా రూ.51 వేలకు చేరువైంది. బుధవారం బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.50,990 వద్ద నిలిచింది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర ఏకంగా రూ.11 వేలు అధికమైంది. కరోనాతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బంగారం కొనేదానిపై ఆలోచన కూడా చేయడం లేదని ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిధి సక్సేనా అభిప్రాయపడ్డారు. 

పదేండ్ల గరిష్ఠానికి ధర

అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు పగ్గాలు లేకుండా దూసుకుపోతున్నాయి. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,800 డాలర్లు పలికింది. 2011 తర్వాత ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. వెండి ధర 18.36 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుత సంవత్సరంలో బంగారం ధరలు నికరంగా 17 శాతం పెరిగినట్లు అయింది.  


logo