ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 16, 2020 , 00:42:40

పసిడి దిగుమతుల్లో క్షీణత

పసిడి దిగుమతుల్లో క్షీణత
  • ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్యకాలంలో 9 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ద్రవ్యలోటును కట్టడి చేయడానికి కేంద్ర ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో 27 బిలియన్‌ డాలర్ల(రూ.1.90 లక్షల కోట్ల) విలువైన పసిడి దిగుమతి అయింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 29.62 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 8.86 శాతం తగ్గినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు 173 బిలియన్‌ డాలర్ల నుంచి 143.12 బిలియన్‌ డాలర్లకు పరిమితమైందని తెలిపింది.

బంగారం ధర రికార్డు స్థాయిలో పుంజుకుంటుండటం, మరోవైపు కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతుండటంతో మదుపరులు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గతేడాది డిసెంబర్‌ నుంచి పసిడి దిగుమతుల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. దేశీయంగా ఆభరణాలకు అధికంగా డిమాండ్‌ ఉండటంతో భారత్‌ ప్రతియేటా 800 నుంచి 900 టన్నులకు వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. వాణిజ్యలోటు, క్యాడ్‌ను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతులపై విధిస్తున్న పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడంతో ఈ రంగంలో ప్రతికూల వృద్ధి నమోదైంది. మరోవైపు జెమ్స్‌ అండ్‌ ఆభరణాల వర్తకులు ఈ సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


logo