గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 17, 2020 , 00:34:03

పసిడి దిగుమతుల్లో క్షీణత

పసిడి దిగుమతుల్లో క్షీణత
  • ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో 9 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పసిడి దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జనవరి మధ్యకాలంలో గోల్డ్‌ దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 9 శాతం తగ్గి 24.64 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. దేశీయ కరెన్సీలో ఇది రూ.1.74 లక్షల కోట్లని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతులు 27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు 133.27 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది.


అంతక్రితం ఏడాది ఇది 163.27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. గతేడాది జూలై నుంచి ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటున్న పసిడి దిగుమతులు..అక్టోబర్‌, నవంబర్‌లో మాత్రం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. డిసెంబర్‌లోనూ 4 శాతం, జనవరిలో 31.5 శాతం మేర పడిపోయాయి. ఆభరణాలకు ఉన్న అధిక డిమాండ్‌ నేపథ్యంలో భారత్‌ ప్రతియేటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ద్రవ్యలోటును కట్టడి చేయడానికి పసిడి దిగుమతులపై విధించే పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. కానీ, ఆభరణాల వర్తకులు మాత్రం ఈ పన్నును 4 శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత పది నెలల్లో జెమ్స్‌ అండ్‌ జ్యూవెల్లరీ ఎగుమతులు కూడా 1.45 శాతం తగ్గి 25.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2018-19లో భారత్‌ 32.8 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. అంతక్రితంతో పోలిస్తే 3 శాతం తక్కువ ఇది.


logo
>>>>>>