గురువారం 04 జూన్ 2020
Business - Apr 15, 2020 , 02:38:16

55 వేలకు పసిడి!

55 వేలకు పసిడి!

  • డిసెంబర్‌ నాటికి చేరుకోనుందంటున్న విశ్లేషకులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: బంగారం ధరలు భగ్గుమనబోతున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా వైరస్‌ రక్కసి రోజురోజుకు విస్తరిస్తుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతుండటంతో దీంతో తమ పెట్టుబడులు సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తుండటంతో వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు రూ.50 వేల నుంచి రూ.55 వేల మధ్యలోకి చేరుకోనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2019లో 23.74 శాతం రిటర్నులు పంచిన బంగారం..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో పదిగ్రాముల ధర రూ.6,794 లేదా 17.31 శాతం ఎగబాకింది. ఇప్పటి వరకు 15.19 శాతం రిటర్నులు పంచింది. కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో వచ్చే రెండు నుంచి మూడేండ్ల వరకు బంగారం మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని   పీఎన్‌జీ జువెల్లరీ ఎండీ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా యుద్ధం లేదా సంక్షోభం జరిగిన వెంటనే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ప్రత్యామ్నాయమైన పసిడి వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ఈ నెల 20 నుంచి సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను విక్రయించడానికి సిద్ధమైంది కేంద్రం. 

ఏడేండ్ల గరిష్ఠానికి ఔన్స్‌ 

అంతర్జాతీయ మార్కెట్లో బం గారం మండుతున్నది. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర ఏడేండ్ల గరిష్ఠ స్థాయి 1,715.25 డాలర్లు పలికింది. డిసెంబర్‌ 2012లో నమోదైన 1,722 డాలర్ల  తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి ధరలు. అమెరికా గోల్డ్‌ ఫ్యూచర్‌లో 1,770. 20 డాలర్లుగా ట్రేడ్‌ అవుతున్నది. కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం పసిడి ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడించారు. 


logo