గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 20, 2020 , 00:21:29

రూ.42 వేలు దాటిన పసిడి

రూ.42 వేలు దాటిన పసిడి
  • వెయ్యికి పైగా పెరిగిన వెండి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌తో బుధవారం పసిడి మళ్లీ రూ.42 వేలు దాటింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల ధర రూ.462 ఎగబాకి రూ.42,339 పలికింది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ నెలకొనడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.1,047 ఎగబాకి రూ.48,562 పలికింది. అంతకుముందు రోజు వెండి రూ.47,605గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్ల అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడం, వీటికితోడు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ కూడా తోడవడంతో ధరలు మరింత పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ ఉన్నతాధికారి తపన్‌ పటేల్‌ తెలిపారు. కరోనా ప్రభావంతో మార్చి త్రైమాసికంలో కార్పొరేట్‌ సంస్థల ఆదాయాల అంచనాలను చేరుకునే అవకాశాలు కనిపించడం లేదని యాపిల్‌ వెల్లడించడంతో మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లించడం ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నడానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,606.60 డాలర్లకు, వెండి 18.32 డాలర్లు పలికింది. 


logo