సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 18:45:42

పసిడి, వెండి ధరలు పై పైకి

 పసిడి, వెండి ధరలు పై పైకి

ముంబై : పసిడి, వెండి ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో రూ.49,348 గరిష్ట రికార్డుకు చేరుకున్నపసిడి ధరలు కొద్దిరోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మరింతగా పెరుగుతున్నాయి. వెండి ధర ఎంసీఎక్స్‌లో రూ.1,050 పెరిగి కిలో రూ.55,050కి చేరుకున్నది. అంతకుముందు సెషన్‌లో రూ.1,150 పెరిగింది. ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.12 శాతం పెరిగి రూ.49,085 పలికింది. వెండి ధర కేవలం రెండు రోజుల్లోనే రూ.2,100కు పైగా పెరిగింది. నిన్న రూ.1,150 పెరగగా, నేడు రూ.1,050 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 9 ఏండ్ల గరిష్టానికి సమీపంలో ఉంది. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ ధర 1,818.53 డాలర్లకు చేరుకున్నది.

అంతకుముందు సెషన్‌లో 1,823 డాలర్లకు కూడా చేరింది. 2011సెప్టెంబర్ నుంచి అది గరిష్టం. అలాగే వెండి నాలుగేండ్ల గరిష్టానికి చేరుకుంది. బంగారం ధర పెరగడానికి ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం తగ్గడం కూడా ఓ కారణం. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావం బంగారంపై ఉంటుంది. భౌతిక బంగారం వినియోగించే దేశాల నుంచి డిమాండ్ తగ్గింది. ఉదాహరణకు భారత్ దిగుమతులు ఏప్రిల్-జూన్ మధ్య ఏకంగా 94 శాతం తగ్గాయి. ఈ ప్రభావాల వల్ల బంగారం అధికంగా పెరగడం లేదు. ఈక్విటీ మార్కెట్లు కూడా పుంజుకోవడం పసిడిపై ఒత్తిడిని తగ్గించింది.

భౌగోళిక టెన్షన్స్ పెరిగి ఉంటే లేదా భౌతిక బంగారం వినియోగించే దేశాల నుంచి డిమాండ్ ఉంటే, ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతే మరింతగా పెరిగే అవకాశముండేది. ప్రస్తుతం డాలర్ మారకం తగ్గడం వంటి కారణాలతో కాస్త పెరుగుతున్నాయి. అయితే ఎంసీఎక్స్‌లో రికార్డ్ హైకి తక్కువగానే ఉంది. ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మినహా భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.3 శాతం పెరిగి 19.89 డాలర్లకు చేరుకుంది. ప్లాటినమ్ 0.1 శాతం పెరిగి 844.40 డాలర్లుగా ఉన్నది.logo