మంగళవారం 27 అక్టోబర్ 2020
Business - Sep 29, 2020 , 16:32:10

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..!

 మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..!

ముంబై: గతకొన్నాళ్ళుగా తగ్గిన పసిడి ధరలు నిన్నపెరిగాయి. ఈరోజు కూడా ప్రారంభ సెషన్‌లో బంగారం, వెండి ధరలు జోరందుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీ ఎక్స్)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం లాభపడి రూ50,190 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.5 శాతం ఎగిసి కిలో రూ.60,730 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి బంగారం ధరలు1శాతం (రూ.500కు పైగా) పెరిగాయి. వెండి 2.3 శాతం (రూ.1,360) పెరిగింది. ఇప్పటికీ ఆగస్టు 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.6,000 తక్కువ ఉంది. కిలో వెండి రూ.18,000 వరకు తక్కువగా ఉంది. ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు రూ.50,100 వద్ద నిలబెట్టుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రూ.50,330 నుంచి రూ.50,500 మధ్య స్థాయిని చూడవచ్చునని, కీలక మద్దతు రూ.49,800 వద్ద ఉండవచ్చునని చెబుతున్నారు.

ఎంసీఎక్స్‌లో వెండి ధర రూ.60,220 వద్ద నిలబెట్టుకోవచ్చని, కిలో రూ.60,800 నుంచి రూ.61,500 స్థాయికి చేరుకోవచ్చునని, కీలక మద్దతు రూ.59,200గా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు అస్థిరంగా కదిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డాలర్ మారకం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 0.15 శాతం పెరిగి 1,883.69 డాలర్లకు పెరిగింది. అంతకుముందు సెషన్‌లో 1.1 శాతం ఎగిసింది.

సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ స్వల్పంగా తగ్గింది. డాలర్ ఇండెక్స్ 0.4 శాతం మేర బలహీనపడింది. అయితే డాలర్ ధర పడిపోతే సిక్స్ బాక్స్ కరెన్సీలోని ఇతర కరెన్సీల్లో బంగారం ధర తగ్గుతుంది. వెండి ఔన్స్ ధర 0.1 శాతం తగ్గి 23.68 డాలర్లు పలికింది. ప్లాటినమ్ 0.2 శాతం తగ్గి 880.56 డాలర్లుగా ఉంది. ప్రపంచ దిగ్గజ గోల్డ్ ఈటీఎఫ్ ట్రస్ట్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.16 శాతం పెరిగి 1,268.89 టన్నులకు పెరిగాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo