గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 11, 2020 , 00:05:24

జీఎమ్మార్‌ చేతికి గ్రీస్‌ ఎయిర్‌పోర్టు

జీఎమ్మార్‌ చేతికి గ్రీస్‌ ఎయిర్‌పోర్టు
  • టెప్నాతో కలిసి 35 ఏండ్లపాటు నిర్వహణ
  • ఐరోపా ప్రాజెక్టును చేజిక్కించుకున్న తొలి భారతీయ ఆపరేటర్‌గా రికార్డు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ మరో ఘనత సాధించింది. ఐరోపా దేశాల్లోని విమానాశ్రయ ప్రాజెక్టు అభివృద్ధి అవకాశాన్ని దక్కించుకున్న తొలి భారతీయ ఎయిర్‌పోర్టు ఆపరేటర్‌గా నిలిచింది. గ్రీస్‌లోని క్రెటే వద్దగల హెరాక్లియాన్‌లో ఏర్పాటయ్యే కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం, రూపకల్పన, ఫైనాన్సింగ్‌, కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించి కన్సేషన్‌ కమెన్స్‌మెంట్‌ డేట్‌ (సీసీడీ)ను జీఎమ్మార్‌ అందుకున్నది. ఈ మేరకు సోమవారం జీఎమ్మార్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థగా కొనసాగుతున్న జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ప్రాజెక్టు ఆరంభ సూచికగా గ్రీస్‌ ప్రధాన మంత్రి మిట్సోటకీస్‌ పునాదిరాయి వేశారు.


జీఎమ్మార్‌ తమ భాగస్వామి టెప్నాతో కలిసి ఈ ప్రాజెక్టు నిర్వహణను 35 ఏండ్లపాటు చూసుకోనున్నది. ఈ ఎయిర్‌పోర్టు డిజైన్‌, నిర్మాణం, ఫైనాన్సింగ్‌, ఆపరేషన్‌, నిర్వహణల కోసం గతేడాది ఫిబ్రవరిలో కన్సేషన్‌ అగ్రిమెంట్‌పై జీఎమ్మార్‌, జెక్‌ టెప్నా సంతకాలు చేసిన విషయం తెలిసిందే. గ్రీస్‌ ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చనుండటంతో ఇది రుణరహిత ప్రాజెక్టుగా నిలువనున్నది. ఐదేండ్లపాటు తొలి దశ నిర్మాణం జరుగనుండగా, జీఎమ్మార్‌, టెర్నాలు ఈ ప్రాజెక్టుపై 500 మిలియన్‌ యూరోలకుపైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. దేశీయంగా న్యూఢిల్లీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న జీఎమ్మార్‌.. ఫిలిప్పీన్స్‌లో మరో ఎయిర్‌పోర్టును ఇంకో సంస్థతో కలిసి నడిపిస్తున్నది. గోవాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును అభివృద్ధిపరుస్తున్నది.


logo