శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Jan 19, 2020 , 00:24:05

జీఎమ్మార్‌ చేతికి ‘కన్నూర్‌' డీఎఫ్‌ఎస్‌

 జీఎమ్మార్‌ చేతికి ‘కన్నూర్‌' డీఎఫ్‌ఎస్‌

హైదరాబాద్‌, జనవరి 18: జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌).. కేరళలోని కన్నూ ర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోగల పన్ను రహిత దుకాణాల (డ్యూటీ-ఫ్రీ షాప్స్‌ లేదా డీఎఫ్‌ఎస్‌) కాంట్రాక్టును గెలుచుకున్నది. ఈ మేరకు కన్నూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (కేఐఏఎల్‌)తో జీఏఎల్‌ రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు శనివారం జీఎమ్మార్‌ గ్రూప్‌ ఓ పత్రికా ప్రకటనలో తెలియజేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఏడేండ్లపాటు ఎయిర్‌పోర్ట్‌లోని పన్ను రహిత దుకాణాల అభివృద్ధి, ఆర్థిక, నిర్వహణ బాధ్యతల్ని జీఎమ్మార్‌ గ్రూప్‌ చూసుకుంటుంది.

ఈ ఒప్పందాన్ని మరో మూడేండ్లు పెంచుకునే వీలు కూడా ఉందని ప్రకటనలో జీఎమ్మార్‌ స్పష్టం చేసింది. కాగా, తమ అధీనంలోని ఎయిర్‌పోర్టుల్లో కాకుండా ఇతర సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్‌పోర్టుల్లో డీఎఫ్‌ఎస్‌లను దక్కించుకోవడం జీఎమ్మార్‌కు ఇదే తొలిసారి. డీఎఫ్‌ఎస్‌లు అంటే రిటైల్‌ ఔట్‌లెట్లే. విదేశీ విమాన ప్రయాణీకులు ఇక్క డ కొన్న వస్తూత్పత్తులపై పలు స్థానిక, జాతీ య పన్నులు, సుంకాల మినహాయింపులను పొందుతారు. ఢిల్లీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుల్లో పన్ను రహిత దుకాణాలను జీఏఎల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమానాశ్రయాలను జీఎమ్మార్‌ గ్రూపే నడుపుతున్న సంగతీ విదితమే. కాగా, కేఐఏఎల్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడంపట్ల జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆనందం వ్యక్తం చేసిం ది.

మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లోని ఇక్కడి వారి రాకపోకలతో విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుందని జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సౌత్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు. పర్యాటకంగా కేరళ అద్భుతమైన ప్రదేశం కావడంతో ఇక్కడికి వివిధ దేశాల నుంచి పర్యాటకులూ అధికంగానే వస్తారని, దీంతో విమానాశ్రయంలోని డీఎఫ్‌ఎస్‌లకు బాగానే ఆదరణ ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల సంఖ్య దాదాపు 11.4 లక్షలుగా నమోదైంది. వీరిలో అంతర్జాతీయ ప్రయాణీకులు 5.4 లక్షలు.


logo