ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 23, 2021 , 19:59:18

బిజినెస్‌ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్‌కు జీఎం వార్నింగ్‌!

బిజినెస్‌ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్‌కు జీఎం వార్నింగ్‌!

ముంబై: మ‌హారాష్ట్ర స‌ర్కార్‌కు ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గజం జ‌న‌ర‌ల్ మోటార్స్ (జీఎం) గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మ‌హారాష్ట్ర‌లో ఉత్పాద‌క యూనిట్‌ను మూసివేయాల‌ని తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డం వ‌ల్ల రాష్ట్రానికి ఉన్న బిజినెస్ ఫ్రెండ్లీ ఇమేజ్ దెబ్బ‌తింటుంద‌ని పేర్కొంది. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం భ‌విష్య‌త్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వ‌చ్చే ఇన్వెస్ట‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తుంద‌ని వ్యాఖ్యానించింది. 

రాష్ట్రంలో ప్రొడ‌క్ష‌న్ యూనిట్‌ను మూసివేసేందుకు అనుమ‌తించాల‌ని జ‌న‌ర‌ల్ మోటార్స్ ఈ వారం ప్రారంభంలో స‌మ‌ర్పించిన అప్లికేష‌న్‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. అందులో ప‌ని చేస్తున్న కార్మికులు.. ఉత్ప‌త్తిని కొన‌సాగించాల‌ని, త‌మ వేత‌నాలు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్ననేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. కార్ల విక్ర‌యాలు త‌క్కువ‌గా ఉండ‌టంతో 2017లోనే జ‌న‌ర‌ల్ మోటార్స్ కార్ల విక్ర‌యాన్ని నిలిపివేసింది. త‌ర్వాత రెండు ఫ్యాక్ట‌రీల్లో ఒక‌దానిని చైనా సెయిక్ మోటార్ కార్పొరేష‌న్‌కు విక్ర‌యించింది.

రెండో ప్లాంట్‌లో గ‌తేడాది డిసెంబ‌ర్ 24 వ‌ర‌కు విదేశాల‌కు వాహ‌నాల ఎగుమ‌తి కోసం ఉత్ప‌త్తి చేసింది. 2020 జ‌న‌వ‌రిలో త‌లేగావ్‌లో గ‌ల రెండో ప్లాంట్‌ను కూడా చైనా ఆటోమేక‌ర్ గ్రేట్ వాల్ మోటార్స్‌కు విక్ర‌యించింది. అయితే చైనా, భార‌త్ మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న వివాదంతో ఈ ప్లాంట్ విక్ర‌య ఒప్పందం అమ‌లు జాప్యం అవుతున్న‌ది.

ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మార్చుకోవాల‌ని కోర‌నున్న‌ట్లు జన‌ర‌ల్ మోటార్స్ తెలిపింది. సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సుమారు 1500 ఉన్నారు. వారికి సుమారు రెండు సంవ‌త్స‌రాల వేత‌నం లేదా చ‌ర్చ‌ల్లో మ‌రింత ఎక్కువ ప‌రిహారం ఇచ్చేందుకు జ‌న‌ర‌ల్ మోటార్స్ యాజ‌మాన్యం సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo