గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 05, 2021 , 02:29:48

గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కారిడార్‌

గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కారిడార్‌

హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి కరోనా వ్యాక్సిన్లు

సరఫరా కోసం జీఎమ్మార్‌-దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (శంషాబాద్‌), జనవరి 4: కొవిడ్‌-19 వ్యాక్సిన్ల సరఫరా కోసం దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌తో జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీఎమ్మార్‌హెచ్‌ఐఏ), జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో (జీఎమ్మార్‌హెచ్‌ఏసీ)లు ఒప్పందం చేసుకున్నాయి. ‘HYDXB-VAXCOR’ (హైదరాబాద్‌ టు దుబాయ్‌ గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కారిడార్‌) పేరుతో ఓ ప్రత్యేక వ్యాక్సిన్‌ ఎయిర్‌ ఫ్రైట్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం జీఎమ్మార్‌ తెలియజేసింది. గత వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో జీఎమ్మార్‌హెచ్‌ఐఏ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌, జీఎమ్మార్‌హెచ్‌ఏసీ సీఈవో సౌరభ్‌ కుమార్‌, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ కార్పొరేషన్‌ కమర్షియల్‌ ఈవీపీ యూజీన్‌ బారీ ఎంవోయూపై సంతకాలు చేసినట్లు వెల్లడించింది.

ఒప్పందం ప్రకారం..

ఇరు సంస్థల మధ్య కుదిరిన ఎంవోయూ ప్రకారం జీఎమ్మార్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ తమ రెండు విమానాశ్రయాల మధ్య కరోనా వ్యాక్సిన్ల రవాణాకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నాయి. వాక్సిన్లకు అవసరమైన ఉష్ణోగ్రతలను నిర్వహించడం తదితర బాధ్యతలనూ చేపడుతాయి. ఇక ‘HYDXB-VAXCOR’లో భాగంగా వివిధ దేశాలకు అనుసంధానమయ్యేలా ఈ రెండు ఎయిర్‌పోర్ట్స్‌ చర్యలు తీసుకుంటాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాల నుంచి విమానాశ్రయం వరకు, అక్కడి నుంచి లాజిస్టిక్స్‌, అటు నుంచి కస్టమర్లకు వ్యాక్సిన్ల డెలివరీని క్రమబద్ధీకరిస్తారు.

హైదరాబాద్‌.. ఫార్మా హబ్‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలు, భారీ ఫార్మా సంస్థల్లో హైదరాబాద్‌లోనే అధికం. ఔషధ రంగంలో భారత్‌కున్న ప్రాధాన్యత హైదరాబాద్‌ వల్లే దక్కుతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేసిన కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ల తయారీలోనూ భాగ్యనగర ఫార్మా సంస్థలు సత్తా చాటాయి. ఇందుకు భారత్‌ బయోటెక్‌ కోవ్యాగ్జిన్‌ నిదర్శనమవగా, తాజా జీఎమ్మార్‌, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఒప్పందం అద్దం పడుతున్నది. హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా ఉండటం వల్లే ఈ ఒప్పందం కూడా కుదిరిందని జీఎమ్మార్‌ చెప్తున్నది.

    భారత్‌ నుంచి వ్యాక్సిన్‌ ఎగుమతులకు జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో ఎప్పుడూ ఒక ముఖద్వారంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుత కొవిడ్‌-19 సమయంలోనూ వ్యాక్సిన్లను సురక్షితంగా, సమర్థవంతంగా రవాణా చేయడానికి నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. 

-ప్రదీప్‌ ఫణికర్‌, జీఎమ్మార్‌హెచ్‌ఐఏ సీఈవో 

వ్యాక్సిన్ల సురక్షిత రవాణాకు ఇప్పుడు అంతటా భారీ డిమాండ్‌ ఉన్నది. హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా ఉన్న నేపథ్యంలోనే జీఎమ్మార్‌-హైదరాబాద్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కరోనా వ్యాక్సిన్ల తయారీ తుది దశకు చేరుకున్న క్రమంలో రవాణా అంశం కీలకం కానున్నది. 

-పాల్‌ గ్రిఫ్త్స్‌, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సీఈవో

VIDEOS

logo