ఆదివారం 24 మే 2020
Business - Feb 17, 2020 , 00:51:21

కరోనా కీలకం

కరోనా కీలకం
  • ఈ వారం స్టాక్‌ మార్కెట్లకు దిక్సూచి.. శుక్రవారం మార్కెట్లకు సెలవు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అంతర్జాతీయంగా నెలకొననున్న పరిణామాలు ఈవారం స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా ఎలాంటి కీలక పరిణామాలు లేకపోవడంతో కరోనా వైరస్‌ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అంశాలని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  మహాశివరాత్రి సందర్భంగా ఈ శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు సెలవుపాటించనున్నాయి. దీంతో ఈవారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకు పరిమితంకానున్నది. దేశీయంగా ఎలాంటి కీలక ప్రకటనలు లేకపోవడంతో కరోనా వైరస్‌తో మార్కెట్‌ వర్గాలు తీవ్ర ఒత్తిడికి గురికావచ్చునని మోతీలాల్‌ ఓశ్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ హెడ్‌ సిద్ధార్థ అంచనావేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో అతలాకుతలమైన ప్రపంచ మార్కెట్లు ఈవారంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చునని ఆయన అంచనావేస్తున్నారు. ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సిందేనని గత శుక్రవారం టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈవారంలో ఈ రంగ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చునని చెప్పారు. గతవారంలో సెన్సెక్స్‌ 115.80 పాయింట్లు లాభపడింది. 


లక్ష కోట్లు పెరిగిన సంపద

గతవారంలో టాప్‌-10 బ్లూచిప్‌ సంస్థల మార్కెట్‌ విలువ లక్ష కోట్లకు పైగా పెరిగింది. వీటిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యధికంగా లాభపడింది. వీటితోపాటు టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు తమ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను పెంచుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రం నష్టపోయాయి. ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 33,534.56 కోట్లు పెరిగి రూ.9,42,422. 58 కోట్లకు చేరుకోగా, హెచ్‌యూఎల్‌ రూ.20,619.84 కోట్లు అధికమై రూ. 4,88,132.65 కోట్లకు, టీసీఎస్‌ రూ.17, 673.73 కోట్లు పెరిగి రూ.8,19,445.77 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్‌టెల్‌ అడ్వాన్స్‌ రూ.13,911.68 కోట్లు పెరిగి రూ.3,08,293.55 కోట్లకు, బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.8,014.92 కోట్లు ఎగబాకి రూ.2,87,802.92 కోట్లకు చేరుకున్నది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.6,138.65 కోట్లు, కొటక్‌ మహీం ద్రా బ్యాంక్‌ రూ.5, 666.73 కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ.3,832.80 కోట్ల చొప్పున పెరుగగా..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎం-క్యాప్‌ రూ. 12,409.10 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.777.55 కోట్లు పడిపోయాయి. 


50 % తగ్గిన ఫండ్‌ పెట్టుబడులు

డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో ఈక్విటీ మార్కెట్లోకి మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు 50 శాతం తగ్గి రూ.12 వేల కోట్లకు పరిమితమయ్యాయి. దేశీయ ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తంకావడం ఇందుకు కారణం. లార్జ్‌-క్యాప్‌, మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ సంస్థల్లోకి పెట్టుబడులు భారీగా పడిపోయాయి. తాజాగా మార్నింగ్‌స్టార్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లోకి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు రూ.11,837 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.23,874 కోట్లుగా ఉన్నది. 


logo