ఆదివారం 24 మే 2020
Business - Mar 26, 2020 , 23:38:57

కాస్త ఆదుకోండి..!

కాస్త ఆదుకోండి..!

-పరిశ్రమకు చేయూతనివ్వండి

-రిజర్వ్‌ బ్యాంకుకు ఆర్థిక సేవల కార్యదర్శి లేఖ

న్యూఢిల్లీ, మార్చి 26: దేశ ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు ఏర్పడిన నేపథ్యంలో ఉపశమన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ఈ ఆపత్కాలంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేయూతనిచ్చేలా కొన్ని అత్యవసర నిర్ణయాలుంటే మంచిదని అభిప్రాయపడింది. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పండా ఆర్బీఐకి ఈ మేరకు ఓ లేఖ రాసినట్లు సమాచారం. కొద్ది నెలలపాటు రుణాల నెలసరి చెల్లింపులను వాయిదా వేయాలంటూ బ్యాంకులకు సూచించాలని, వ్యవస్థలో నగదు కొరతను అధిగమించేలా చర్యలుండాలని, మొండి బకాయి (ఎన్‌పీఏ)ల వర్గీకరణలో సడలింపు అవసరమని సదరు లేఖలో పండా అన్నారు. 

భారత్‌పై ప్రభావం పెద్దదే: డీఅండ్‌బీ

కరోనా వైరస్‌ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడిందని, దీనివల్ల దేశ జీడీపీని భారీగా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘భారత ఆర్థిక వృద్ధిపై కరోనా ప్రభావం తీవ్రమే’ అని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ తాజా ఆర్థిక అంచనా. ‘21 రోజుల లాక్‌డౌన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో మా జీడీపీ అంచనా 5 శాతాన్ని సవరించేలా చేస్తున్నది. 2020-21 వృద్ధిరేటు అంచనాలపైనా అనిశ్చితిని ఏర్పరుస్తున్నది’ అని డీఅండ్‌బీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త అరుణ్‌ సింగ్‌ అన్నారు. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు పడిపోవచ్చన్న ఆయన ఈ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.5-6.7 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 2.35-2.5 శాతంగా నమోదు కావచ్చన్నారు. ఆటో, నిర్మాణ, ఔషధ, ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఉక్కు, బొగ్గు, పర్యాటక, రవాణా, విమానయాన, ఐటీ, ఇంధన, ఆహార శుద్ధి, పౌల్ట్రీ, మత్స్య ఇలా అనేక రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగాల్లోని పరిశ్రమలు, వీటి ఆధారంగా నడుస్తున్న వ్యాపారాలు, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని బ్రిటన్‌ బ్రోకరేజీ బార్క్‌లేస్‌ అంచనా వేసింది.

ఇండస్ట్రీ ఏం కోరుకుంటున్నది

  • 100 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేట్ల కోత
  • నగదు నిల్వల నిష్పత్తి తగ్గింపు
  • నగదు లభ్యత పెంచేలా చర్యలు
  • 3 నెలలపాటు రుణాల వడ్డీ, అసలు చెల్లింపుల మినహాయింపు
  • ఎన్‌పీఏల నిబంధనల సడలింపు

మారటోరియం ఇవ్వాలి

ముఖ్యంగా కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న వ్యక్తిగత, సంస్థాగత వ్యాపారులకు చేయూతనందించాలని కోరారు. ఈ ప్రాణాంతక మహమ్మారి నిర్మూలన కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోగా, వ్యాపారాలు స్తంభించిపోయాయి. దీంతో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని దుస్థితి తలెత్తింది. అందుకే వీరికి రుణాలపై మారటోరియం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆర్బీఐకి పండా సూచించారు. ఈ విషయంలో ఆర్బీఐ చొరవ చూపకపోతే రుణగ్రహీతలపై బ్యాంకులు చర్యలకు దిగే వీలుందని, దీనివల్ల వారి రుణ చరిత్ర దెబ్బతినే ప్రమాదముందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఏప్రిల్‌ 3న జరుగనున్న క్రమంలో పండా లేఖ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇందులోని సూచనల మేరకు ఆర్బీఐ పలు నిర్ణయాలు తీసుకోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.


logo