శుక్రవారం 05 జూన్ 2020
Business - May 20, 2020 , 00:33:35

భారత్‌కు జర్మనీ ఫుట్‌వేర్‌

భారత్‌కు జర్మనీ ఫుట్‌వేర్‌

  • చైనాకు కాసా ఎవర్జ్‌ గుడ్‌బై
  • యూపీలో 110 కోట్లతో ప్లాంట్‌

న్యూఢిల్లీ, మే 19: కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాను అక్కడి విదేశీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన పాదరక్షల తయారీ సంస్థ కాసా ఎవర్జ్‌ గంబ్‌.. డ్రాగన్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది. వోన్‌ వెక్స్‌ బ్రాండ్‌ పేరుతో ఈ సంస్థ ఆరోగ్య సంబంధిత పాదరక్షలను ఉత్పత్తి చేస్తున్నది. చైనాలో కాసా ఎవర్జ్‌కు ఏటా 30 లక్షలకుపైగా జతల షూలను ఉత్పత్తి చేసే రెండు ప్లాంట్లున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం ఉత్పాదక కేంద్రాలను భారత్‌కు తరలిస్తున్నట్లు ఆ సంస్థ దేశీయ లైసెన్సీ లాట్రిక్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ప్లాంట్‌ను నెలకొల్పుతున్నామని లాట్రిక్‌ ఇండస్ట్రీస్‌ సీఈవో ఆశిష్‌ జైన్‌ పీటీఐకి ఓ ఈ-మెయిల్‌ ద్వారా స్పష్టం చేశారు. ఆరంభ దశలో భాగంగా రూ.110 కోట్ల పెట్టుబడులను పెడుతున్నామని వెల్లడించారు. ‘అవును. పలుమార్లు జరిపిన చర్చల అనంతరం చైనా నుంచి భారత్‌కు తమ మొత్తం ఉత్పాదక కేంద్రాలను తరలించాలని కాసా ఎవర్జ్‌ నిర్ణయించింది’ అని ఆశిష్‌ జైన్‌ సదరు మెయిల్‌లో ప్రకటించారు. యూపీలో ఏర్పాటు చేయబోయే కొత్త ప్లాంట్‌ ఉత్పాదక సామర్థ్యం 30 లక్షలకుపైగా జతల షూస్‌ అని జైన్‌ తెలిపారు. అక్కడి ప్రభుత్వ సహకారంతో రెండేండ్లలో పూర్తి సామర్థ్యాన్ని అందుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక రెండో దశ పెట్టుబడుల్లో భాగంగా సహాయక, అనుబంధ పరిశ్రమల విస్తరణపై దృష్టి పెడుతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా దేశాల్లో కాసా ఎవర్జ్‌ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. దీనికి 18 ఉత్పాదక కేంద్రాలుండగా, 12 లైసెన్సీలున్నారు. ఈ లైసెన్సీల ద్వారా ఆయా దేశాల్లో కాసా ఎవర్స్‌ బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ అవుతున్నాయి.


logo