ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 12, 2020 , 02:27:02

70 ఏండ్ల కనిష్ఠానికి జీడీపీ

70 ఏండ్ల కనిష్ఠానికి జీడీపీ

బెంగళూరు, ఆగస్టు 11: దేశ ఆర్థిక వృద్ధిరేటు తీరుతెన్నులపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే నేలచూపులు చూస్తున్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మున్ముందు మరింత దిగజారి స్వాతంత్య్రానంతరం (గత ఏడు దశాబ్దాల్లో) ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని, పని ప్రదేశాల నుంచి గ్రామాలకు తిరిగివెళ్లిన వలస కార్మికులను వెనక్కు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ అండ్‌ టెక్నాలజీ నిర్వహించిన వర్చువల్‌ చర్చాగోష్ఠిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి రంగంలోని అన్ని వ్యవస్థలు తగిన ముందు జాగ్రత్తలతో మళ్లీ పూర్తిస్థాయిలో పనిచేయగలిగే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. ‘ప్రపంచ జీడీపీ, వాణిజ్యం పడకేశా యి. అంతర్జాతీయ ప్రయాణాలు అదృశ్యమయ్యాయి. జీడీపీ 10 శాతం మేరకు క్షీణించే అవకాశాలున్నాయి’ అని నారాయణమూర్తి పేర్కొన్నారు. కొవిడ్‌-19కు తొలి వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విడుదల చేయవచ్చని, ఇది మన దేశంలో అందుబాటులోకి రావడానికి కనీసం 6 నుంచి 9 నెలలైనా పట్టవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంతోపాటు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే సాధ్యమైనంత వేగంగా ప్రతి ఒక్కరికీ టీకాలు వేయగలిగేలా ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్నారు.logo