గేరు మార్చిన ఎకానమీ

- వేగంగా కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థ
- క్యూ3లో వృద్ధిపథంలోకి జీడీపీ: ఆర్బీఐ ఆర్టికల్
ముంబై, డిసెంబర్ 24: కరోనా మహమ్మారి ప్రభావంతో బక్కచిక్కిన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది. కొవిడ్-19 పరిస్థితులు భారత జీడీపీని ఒక్కసారిగా భీకర అగాథంలోకి నెట్టేశాయని, అయితే అందరి అంచనాలను మించి తిరిగి పైకొస్తున్నదని చెప్పింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో వృద్ధిరేటు మైనస్ నుంచి తేరుకోవచ్చని ఆర్బీఐ బులిటెన్‌లో ‘దేశ ఆర్థిక వ్యవస్థ’పై వచ్చిన ఓ ఆర్టికల్ పేర్కొన్నది. ‘కరోనా ప్రభావిత పరిస్థితుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదనడానికి ఎన్నో రుజువులు కనిపిస్తున్నాయి’ అని ఆర్బీఐ అధికారులు రాసిన ఈ కథనం స్పష్టం చేసింది. కరోనా దెబ్బకు దేశ జీడీపీ ఈ ఏప్రిల్-జూన్‌లో మునుపెన్నడూ లేనివిధంగా మైనస్ 23.9 శాతానికి దిగజారిన విషయం తెలిసిందే. జూలై-సెప్టెంబర్‌లో కోలుకున్నప్పటికీ మైనస్ 7.5 శాతంగానే ఉన్నది. దీంతో క్యూ3లో స్వల్పంగా వృద్ధిరేటు కనిపించవచ్చని ఆర్బీఐ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ అంచనాలను ఇండియా రేటింగ్స్ సైతం మైనస్ 7.8 శాతానికి సవరించింది. ఇంతకుముందు 11.8 శాతంగా పేర్కొన్నది.
అన్నీ అనుకూలం..
కరోనా వైరస్‌తో వచ్చిపడిన లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినా.. తదనంతర పరిస్థితులు అనుకూలించడం వల్ల జీడీపీ ఊహించనివిధంగా కోలుకుందని ఆర్బీఐ ఈ సందర్భంగా తెలిపింది. వేగవంతమైన అన్‌లాక్ ప్రక్రియకుతోడు నిస్తేజంగా మారిన వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కొత్త ఉత్సాహాన్నిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు కలిసొచ్చాయని వివరించింది. జీడీపీని బలోపేతం చేయడానికి అన్నివిధాలా కేంద్రం కృషి చేసిందని తెలిపింది.
రుణాలకు మళ్లీ డిమాండ్
కరోనా వైరస్ నేపథ్యంలో రుణాలకు పడిపోయిన డిమాండ్.. తిరిగి పుంజుకుంటున్నదని ఆర్బీఐ తాజా సర్వేలో తేలింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో కొవిడ్-19 దెబ్బకు అంతా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో లోన్లకు ఆదరణ కరువైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, రుణాలపై బ్యాంకర్ల సెంటిమెంట్ కూడా మెరుగైందని ఆర్బీఐ ‘బ్యాంక్ లెండింగ్ సర్వే’ చెప్తున్నది. రిటైల్, పర్సనల్ లోన్లకు డిమాండ్ ఉందని, జూలై-సెప్టెంబర్‌లో మళ్లీ దాదాపు మునుపటి పరిస్థితులు నెలకొన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. పెరుగుతున్న వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు.. రుణాలకు డిమాండ్‌ను క్రమేణా పెంచుతున్నాయని తెలియజేసింది.
తాజావార్తలు
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
- సాయి పల్లవి సారంగదరియా పాటపై ముదురుతున్న వివాదం
- సైనిక స్థావరంలో భారీపేలుడు.. 20 మంది మృతి
- ప్రకటన పెట్టి.. బోల్తా కొట్టిస్తారు
- మొదటి భార్య వేధిస్తుంది.. పుట్టింటికి పంపించండి