శనివారం 06 జూన్ 2020
Business - May 04, 2020 , 02:46:37

రోజుకు 60 వేల కోట్లు

రోజుకు 60 వేల కోట్లు

40 రోజుల్లో రూ.24 లక్షల కోట్ల నష్టం దేశ ఆర్థిక వ్యవస్థకు కరోనా కాటు

న్యూఢిల్లీ, మే 3: కరోనా వైరస్‌ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుంగదీస్తున్నది. దీని ధాటికి గత 40 రోజుల లాక్‌డౌన్‌ పీరియడ్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరంగా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 320 బిలియన్‌ డాలర్ల (రూ.24 లక్షల కోట్ల) నష్టం వాటిల్లినట్టు ఓ నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కన రోజుకు 800 కోట్ల డాలర్ల (రూ.60,000 కోట్ల) నష్టం వాటిల్లినట్టు స్పష్టమవుతున్నది. లాక్‌డౌన్‌ ప్రభావం ట్రావెల్‌, మొబిలిటీ రంగాలపై తీవ్రంగా ఉన్నదని, దీని ఫలితంగా ఓయో, ఓలా, మేక్‌మైట్రిప్‌ లాంటి సంస్థల ఆదాయం గణనీయంగా క్షీణించిందని ‘డాటాల్యాబ్స్‌' నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం కూడా కరోనా కాటుతో తల్లడిల్లుతున్నది. ఈ రంగంలోని అనేక చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని పరిశ్రమలు అతితక్కువ మంది కార్మికులతో పనిచేస్తున్నాయి. ఫలితంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో ఆదాయానికి భారీగా గండిపడినట్టు కొవిడ్‌-19 స్టార్టప్‌ ఇంపాక్ట్‌ నివేదిక పేర్కొన్నది. మరికొన్ని రంగాల్లోనూ కరోనా వైరస్‌ మృత్యుఘంటికలు మోగించగా.. సరఫరాల వ్యవస్థలో ఏర్పడిన అవాంతరాలతో తయారీరంగం తీవ్రంగా నష్టపోతున్నది. అయితే ప్రస్తుతం వినియోగదారుల స్వభావంలో వచ్చిన మార్పులు కొన్ని రంగాల ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. హైపర్‌లోకల్‌ డెలివరీలు, మీడియా అండ్‌ కంటెంట్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ లాంటి సేవలతోపాటు ఇతర టెక్‌ అప్లికేషన్లకు అకస్మాత్తుగా డిమాండ్‌ పెరుగడమే ఇందుకు కారణం. దీని ఫలితంగా మున్ముందు కొన్ని దేశీయ స్టార్టప్‌ల ఆదాయం మరింత పెరిగే అవకాశమున్నది.


logo