ఆసియాలో రెండో అతిపెద్ద శ్రీమంతుడు
ముంబై, మే 20: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చరిత్రను సృష్టించారు. ఆసియా సంపన్న వర్గాల జాబితాలో రెండో స్థానానికి దూసుకుపోయారు. ఆయనకు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా పుంజుకోవడంతో ఈ స్థానానికి చేరుకున్నట్లు తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. చైనా వ్యాపారవేత్త జాంగ్ షాన్షాన్ స్థానాన్ని అదానీ అక్రమించుకున్నట్లు అయింది. గడిచిన ఏడాదికాలంగా అదానీ సంపద విలువ 3,270 కోట్ల డాలర్ల మేర పెరుగడంతో ఆయన నికర విలువ 6,650 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు నివేదిక స్పష్టంచేసింది. జాంగ్ షాన్షాన్ నెట్వర్త్ 6360 కోట్ల డాలర్ల వద్ద వుంది. మరోవైపు ఆసియాలో అత్యంతధనికుడిగా అగ్రస్థానంలో వున్న ముకేశ్ అంబానీ సంపద ఏడాదిలో 17.55 కోట్ల డాలర్ల మేర తగ్గింది. ప్రస్తుతం ఆయన సంపద 7650 కోట్ల డాలర్లు. ప్రస్తుతం ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో వుండగా, అదాని 14వ స్థానానికి చేరినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలియపరుస్తున్నది.