బుధవారం 03 జూన్ 2020
Business - Mar 30, 2020 , 00:09:37

కార్పొరేట్ల దన్ను

కార్పొరేట్ల దన్ను

- కరోనా కట్టడి కోసం పీఎం-కేర్స్‌ నిధికి విరాళాల వెల్లువ 

-గౌతమ్‌ అదానీ, జేఎస్‌డబ్ల్యూ రూ.100 కోట్ల చొప్పున సాయం

-రూ.50 కోట్లు ప్రకటించిన ఉదయ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌

ముంబై, మార్చి 29: కరోనా వైరస్‌ దెబ్బకు అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు కార్పొరేట్లు ముందుకొస్తున్నారు. ఆపత్కాలంలో మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ప్రధాన మంత్రి-సంరక్షణ నిధి (పీఎం-కేర్స్‌ ఫండ్‌)కి ఆదివారం అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ మరో రూ.100 కోట్లను ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.25 కోట్లు, ఆ బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కొటక్‌ రూ.25 కోట్ల చొప్పున పీఎం-కేర్స్‌ నిధికి విరాళాలు ప్రకటించారు. అదనంగా మరో రూ.10 కోట్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఇస్తున్నది. ‘రాబోయే కొద్దివారాలు దశాబ్దాల తరబడి మానవత్వానికి ప్రతీకగా నిలవాలి. ప్రాణాలను, ప్రజలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. విజ్ఞానం, ఔషధాలు వైరస్‌ను అంతమొందిస్తే.. అంతా కలిసి చేసే ఆర్థిక సాయం సంక్షోభాన్ని నివారిస్తుంది’ అని ఉదయ్‌ ట్వీట్‌ చేశారు.

కల్యాణ్‌ జ్యుయెల్లర్స్‌ రూ.10 కోట్ల సాయం

కల్యాణ్‌ జ్యుయెల్లర్స్‌ కరోనా వైరస్‌పై పోరులో భాగంగా రూ.10 కోట్ల సాయానికి ముందుకొచ్చింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో స్థానిక, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో నిరుపేదలకు ఆహార, ఇతర నిత్యావసరాలను అందిస్తామని ఓ ప్రకటనలో సంస్థ సీఎండీ టీఎస్‌ కల్యాణరామన్‌ చెప్పింది. కాగా, ఇప్పుడున్న పరిస్థితులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తమ 8వేల ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తామని ఈ సందర్భంగా సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ తమ 28 దవాఖానల్లో కరోనా వైరస్‌ బాధితుల కోసం ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటుచేసింది. వీటిలో 262 పడకలను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి కరోనా కేసులు నమోదవగా, ఇప్పటిదాకా 25 మంది చనిపోయారు. వచ్చే నెల 14వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నది. భారత్‌సహా పలు దేశాలకు అలీబాబా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా.. ఫేస్‌ మాస్కు లు, కరోనా వైరస్‌ టెస్ట్‌ కిట్లను అందిస్తున్నారు. ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌బర్గ్‌ సైతం 25 మిలియన్‌ డాలర్ల సాయాన్ని కొవిడ్‌-19 నిర్మూలన కోసం ప్రకటించారు.


logo