గురువారం 28 మే 2020
Business - Apr 25, 2020 , 00:40:32

ఫండ్‌ మార్కెట్‌లో అలజడి

ఫండ్‌ మార్కెట్‌లో అలజడి

 • ఆరు పథకాలను మూసేసిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌  
 • కరోనా వైరస్‌ ఒత్తిళ్లతో సంచలన నిర్ణయం
 • ఇరుక్కుపోయిన రూ.31వేల కోట్ల సంపద  
 • మదుపరుల పెట్టుబడులు భద్రం: ఆంఫీ 
 • తుమ్ముకు కరోనా.. దగ్గుకు కరోనా.. చివరకు మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో పథకాల మూసివేతకూ కరోనాయే కారణమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ సంక్షోభం కబళించేస్తున్నదిప్పుడు. నగదు వనరులను మింగేస్తూ భవిష్యత్తుపైనే భరోసా లేకుండా చేస్తున్నదీ మహమ్మారి. ముఖ్యంగా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో అలజడి సృష్టిస్తున్నది. 25 ఏండ్లుగా భారత్‌లో నడుస్తున్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 6 రుణ పథకాలను మూసేసింది. ఫలితంగా రూ.31 వేల కోట్ల  మదుపరుల సంపద ప్రమాదంలో పడింది.

ముంబై, ఏప్రిల్‌ 24: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రత్యక్ష ప్రభావం మొదలైంది. ఇన్నాళ్లూ ఆ రంగానికి అంత నష్టం.. ఈ రంగంలో ఇన్ని వేల ఉద్యోగాలు పోనున్నాయన్న అంచనాలనే విన్నాం. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి కారణంగా అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ భారత్‌లో ఆరు రుణ పథకాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు రూ.30,800 కోట్ల మదుపరుల సంపద ఇరుక్కుపోయింది. తమ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని సంస్థ స్పష్టం చేసింది. పథకాల మూసివేతపై మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీతో చర్చించామని శుక్రవారం ఫ్రాంక్లిన్‌ ఇండియా తెలియజేసింది. అలాగే మార్కెట్‌ నిబంధనల ప్రకారం మదుపరులకు వారి పెట్టుబడులు తిరిగి అందుతాయని స్పష్టం చేసింది. 

కారణం ఇదీ..

కరోనా నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులను కారణంగా చూపు తూ ఓ ఫండ్‌ మేనేజర్‌ తమ పథకాలను మూసివేయడం ఇదే తొలిసారి. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య అత్యధిక మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ముందుకు వస్తున్నారని ఫ్రాంక్లిన్‌ తెలిపింది. బాండ్‌ మార్కెట్లలో నగదు కొరత కూడా తమ ఈ నిర్ణయానికి ఓ కారణమని పేర్కొన్నది. 

ఆందోళనలో మదుపరులు

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ తీసుకున్న నిర్ణయంతో మదుపరులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓవైపు కొత్త పెట్టుబడులకు అవకాశం లేకుండా పోయింది.. మరోవైపు ఇప్పుడున్న పెట్టుబడులను వెనక్కి తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఈ ఆరు పథకాలపై రూ.25వేల కోట్ల పెట్టుబడులున్నాయని తెలుస్తుండగా, రూ. 30,800 కోట్లు ఇరుక్కుపోయాయని పరిశ్రమ వర్గాల అంచనా. ఇదిలావుంటే రుణ పథకాలు సురక్షితమేనని, ఒక్క సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందాల్సిన పని లేదని మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ సంఘం ఆంఫీ మదుపరులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.

ముగింపు పలికిన పథకాలివే

 • లో డ్యూరేషన్‌ ఫండ్‌
 • డైనమిక్‌ అక్యూరల్‌ ఫండ్‌
 • క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌     
 • షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌
 • అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌
 • ఇన్‌కమ్‌ ఆపార్చునిటీస్‌ ఫండ్‌


logo